Share News

2026-27 ఏపీ బడ్జెట్.. పయ్యావుల కీలక చర్చలు.. వాటిపైనే స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:02 PM

బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు శాఖలకు చెందిన మంత్రులతో సమావేశాలు పూర్తయ్యాయి.

2026-27 ఏపీ బడ్జెట్.. పయ్యావుల కీలక చర్చలు.. వాటిపైనే స్పెషల్ ఫోకస్
AP Budget 2026-27

అమరావతి, ఫిబ్రవరి 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆ శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనెల 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి వరుసగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు శాఖలకు చెందిన మంత్రులతో సమావేశాలు పూర్తయ్యాయి. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, అనితలతో వరుస సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల్లో ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు, ప్రాధాన్యతలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. వివిధ శాఖల మంత్రులు తమ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రికి సమర్పించారు.


సంక్షేమం, అభివృద్ధికి సమపాళ్లలో నిధులు కేటాయించేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేలా బడ్జెట్ కూర్పు సాగుతోంది. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులకు ఎస్క్రో ఖాతాలు తెరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. వివిధ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.


రోడ్ల అభివృద్ధిపైనా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పాత హోల్స్ రోడ్లు, కొత్త రోడ్ల నిర్మాణానికి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. హార్టికల్చర్ రంగ అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు, లాజిస్టిక్స్ సెక్టార్ వృద్ధిపై సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది. అంతేకాకుండా, జల్ జీవన్ మిషన్ పథకాన్ని వేగవంతం చేసేందుకు తగిన ప్రణాళికలు, నిధుల కేటాయింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం (ఫిబ్రవరి 3) చర్చలు జరిపారు. అలాగే మిగిలిన శాఖల మంత్రులతోనూ త్వరలో సమావేశాలు జరిగే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

అనుమతి లేకున్నా.. గుంటూరుకు జగన్.. భారీగా ట్రాఫిక్ జామ్..

తిరుమలతో రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీకి భానుప్రకాష్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 03:50 PM