అనుమతి లేకున్నా.. గుంటూరుకు జగన్.. భారీగా ట్రాఫిక్ జామ్..
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:15 PM
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. పెద్ద సంఖ్యలో వాహనాలతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరుకు జగన్ పయనమయ్యారు..
గుంటూరు, ఫిబ్రవరి 4: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) తాడేపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మంది మార్బలంతో గుంటూరుకు బయలుదేరారు మాజీ సీఎం. ఈ క్రమంలో గుంటూరు - విజయవాడ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కనీసం అంబులెన్స్‌లకు కూడా దారి లేకుండా పోయింది. ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ట్రాఫిక్ ఇబ్బందులపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గతంలో పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో జగన్ పర్యటనల సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోలీసు ఆంక్షలు విధించారు. ఎడ్లపాడు జాతీయ రహదారిపై వైసీపీ నేతల వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. గుంటూరులో జగన్ పర్యటనకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టి, పలువురు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వైసీపీ కేడర్ తరలివెళ్తోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు దగ్గర తనిఖీలు నిర్వహించి ఎక్కడికక్కడ వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరోవైపు.. జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నాయకులు పోలీసు అధికారులను కోరారు. అందుకు పోలీసులు నిరాకరించారు. గుంటూరు జిల్లా పరిధిలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎక్కడా బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని జిల్లా పోలీసు యంత్రాంగం ప్రకటన జారీ చేసింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా, సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పని గుంటూరు పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
రాజమండ్రిలో కలకలం.. స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి..
Read Latest AP News And Telugu News