నా భార్య, పిల్లలు ఎందుకు చనిపోయారో తెలియడం లేదు: సురేందర్ రెడ్డి ఆవేదన
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:36 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంపై భర్త సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయ మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లల ఆత్మహత్య మిస్టరీ ఇంకా వీడలేదు. పిల్లలతో కలిసి తన భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కారణాలు అర్థం కావడం లేదని విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి అంటున్నారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) సురేందర్ మాట్లాడుతూ... 29వ తేదీన చివరగా తనతో మాట్లాడిందని... ఆ సమయంలో మాములుగానే మాట్లాడినట్లు తెలిపారు. పిల్లలకు వాళ్ల అమ్మ మాటే శిరోధార్యమని... ఏం అడిగినా కాదనరని అన్నారు. తను మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య వచ్చిందో అర్థం కావడం లేదని వాపోయారు.
పిల్లలతో కలిసి తను ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని అన్నారు సురేందర్ రెడ్డి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా తమకు ఎలాంటి సమస్యలు లేవని వివరించారు. వాళ్లు చనిపోయారు అన్న బాధ కన్నా ఎందుకు చనిపోయారో తెలియకపోవడం తనను చాలా బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లల ఆత్మహత్యలపై కారణాలను త్వరగా నిగ్గు తేల్చాలని పోలీసులను సురేందర్ రెడ్డి కోరారు.
కాగా.. గత శనివారం(జనవరి 31) తెల్లవారుజామున విజయశాంతి రెడ్డి, తన కుమార్తె చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డితో కలిసి చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ డెడ్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. విజయ.. హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ గ్రూప్ లీడర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త సురేందర్ రెడ్డి.. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే ఇద్దరు పిల్లులు కూడా ఇంటర్ చదువుతున్నారు. అయితే ఎలాంటి గొడవలు, ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ విజయ, తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడటం మిస్టరీగా మారింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
నాన్న ఆదేశాలతో అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం: బాలకృష్ణ
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్..
Read Latest Telangana News And Telugu News