స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:46 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్థిక కష్టనష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని గవర్నర్ చెప్పుకొచ్చారు.
అమరావతి, ఫిబ్రవరి 11: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer) ప్రసంగించారు. ప్రజా సంక్షేమం అనే కోణంలోనే.. ప్రభుత్వం ప్రతీ నిర్ణయాన్ని తీసుకుంటోందని తెలిపారు. ఏడాదికి రూ.33వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతోందన్నారు. 66 లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందుతోందని గవర్నర్ వెల్లడించారు.
స్త్రీశక్తి నుంచి మెగా డీఎస్సీ వరకూ..
స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతోందని తెలిపారు గవర్నర్. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల చొప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మంది పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు 5,757 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసిందని వివరించారు. మత్స్యకార సేవలో పథకం ద్వారా 1.2 లక్షల మందికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. లక్ష మందికి పైగా హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోందని గవర్నర్ చెప్పారు.
గత పాలనపై విమర్శలు..
విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్థిక నష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి ఆగిపోయిందని.. ఆర్థికపరమైన ఇబ్బందులు పెరిగాయని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా గత పాలకులు పాలించారని.. 22ఏ అధికరణను దుర్వినియోగం చేశారన్నారు. మౌలిక వసతులైన విద్యుత్, సాగునీరు, రహదారులు లాంటి రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని గవర్నర్ తెలిపారు.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రీస్టార్ట్..
2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పజెప్పారని.. సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సహకారంతో ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతోందని వెల్లడించారు. 19 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని పునర్నిర్మించి గాడిలో పెట్టిందన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రీస్టార్ట్ అయ్యాయని తెలిపారు. తొలి 9 నెలల కాలంలో దిద్దుబాటు చర్యలు, పాలసీలు, వ్యవస్థల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసి పారదర్శకమైన పాలనను కూటమి ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పాలన సాగిస్తోందన్నారు. పది సూత్రాలను నిర్దేశించుకుని.. ప్రజలకు సుపరిపాలన అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా చేసుకుని ప్రభుత్వ పాలన సాగుతోందని అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
త్వరలోనే ఫ్యామిలీ కార్డు..
జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని గవర్నర్ వెల్లడించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతీ కుటుంబానికి అవసరమైన ప్రయోజనాలను అందిస్తున్నామన్నారు. త్వరలో ఫ్యామిలీ కార్డును అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. పీ4 ద్వారా పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే సూత్రంతో 113 నియోజకవర్గాల్లో 205 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. త్వరలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ గ్రామీణ అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని గవర్నర్ నజీర్ వెల్లడించారు.
బీసీ వర్గాల బలోపేతం కోసం...
అందరికీ ఇల్లు.. అనే లక్ష్యంతో గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు గవర్నర్. ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా చేసిందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం.. వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఎంస్ఎంఈల ద్వారా బీసీ వర్గాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టిందన్నారు. మైనారిటీలకు భద్రత, వారికి అభివృద్ధిలో భాగస్వామ్యం, విద్య, ఆర్థిక సహకారంతో మేలు చేకూరుస్తోందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు.
ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి రంగాల్లో దూసుకెళ్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తోందన్నారు. అంతర్జాతీయ సంస్థలు.. ఏపీని పెట్టుబడులు, నాలెడ్జ్ ఎకానమీకి గమ్యస్థానంగా ఎంచుకున్నాయని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా యువతకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని గవర్నర్ వివరించారు. ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించేలా.. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తోందన్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు కృషి చేస్తోందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి రూ.2.5 లక్షల వరకూ సమగ్ర ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు. 1.43 కోట్ల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు నగదురహిత వైద్యం అందుబాటులోకి తీసుకువస్తోందని అన్నారు. క్యాన్సర్ సహా ఇతర ఖరీదైన చికిత్సలకు ఎలాంటి పరిమితి లేకుండా ప్రభుత్వం ఈ బృహత్ పథకాన్ని చేపడుతోందని చెప్పారు గవర్నర్.
మహిళలే కేంద్ర బిందువులు..
వృద్ధుల సంఖ్య పెరగడం వివిధ దేశాలకు సవాల్‌గా మారిందని.. దీనిపై సరైన విధానాన్ని రూపొందించాలని సభను కోరుతున్నట్లు గవర్నర్ తెలిపారు. అక్రమ మద్యం తయారీ నుంచి విముక్తి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. గంజాయి నిర్మూలనలో పురోగతి సాధించిందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ‘వీబీ జీ రామ్ జీ’ పథకం ద్వారా ఉపాధి రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచారన్నారు. అభివృద్ధి వ్యూహంలో మహిళలే కేంద్ర బిందువులని.. ఆర్థిక భాగస్వాములు, స్వయం పేరుతో డ్వాక్రా మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తోందన్నారు. ఏడాదికి లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని.. వచ్చే ఏడాది 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. అంగన్ వాడీలను బలోపేతం చేసి.. గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోందన్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి ద్వారా మహిళలకు న్యాయ సహకారం కూడా అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్
నెయ్యి ట్యాంకర్ల నుంచి లంచాలు..
Read Latest AP News And Telugu News