Share News

ఎమ్మెల్యే సతీమణి డిజైనర్‌ స్టోర్‌లో చోరీ.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్

ABN , Publish Date - Feb 11 , 2026 | 09:42 AM

బంజారాహిల్స్‌లో ప్రముఖ డిజైనర్ అనుశ్రీ రెడ్డి నిర్వహిస్తున్న డిజైనర్ స్టోర్‌లో చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో షూ ముద్రలు కీలకంగా మారాయి.

ఎమ్మెల్యే సతీమణి డిజైనర్‌ స్టోర్‌లో చోరీ.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్
Banjara Hills Theft

హైదరాబాద్, ఫిబ్రవరి 11: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సతీమణి అనుశ్రీ రెడ్డి నిర్వహిస్తున్న డిజైనర్ స్టోర్‌లో జరిగిన చోరీ కేసును బంజారాహిల్స్ పోలీసులు ఛేదించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో ఓ డిజైనర్ స్టోర్‌ను నిర్వహిస్తున్నారు అనుశ్రీ రెడ్డి. ఈనెల 6న ఆ స్టోర్‌లో ఓ చోరీ జరిగింది. ఈ స్టోర్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అమీనుల్ హక్(38) ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. అస్సాంకు చెందిన ఈ నిందితుడు కొన్ని నెలలుగా స్టోర్‌లో నమ్మకంగా పనిచేస్తున్నాడు.


ఈ నెల 6న రాత్రివేళ పక్కా ప్రణాళికతో స్టోర్‌లోకి ప్రవేశించిన నిందితుడు.. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా కిటికీ గుండా లోపలికి వెళ్లాడు. అక్కడ స్క్రూడ్రైవర్ సాయంతో లాకర్ తెరిచి రూ.2.43 లక్షల నగదును చోరీ చేశాడు. దోచుకెళ్లిన ఆ సొమ్మును తన ఇంట్లోని డస్ట్‌బిన్‌లో దాచాడు. మరుసటి రోజు(7న తేదీ) ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన అమీనుల్ హక్.. స్టోర్‌లో దొంగలు పడ్డారంటూ హడావుడి చేశాడు. సీసీటీవీ కెమెరాల్లో స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు, క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది.


కిటికీ వద్ద లభించిన బూట్ల ముద్రలు కీలక ఆధారంగా నిలిచాయి. ఆ షూస్ ముద్రలు పూర్తిగా మ్యాచ్ కావడంతో అమీనుల్ హక్ గుట్టు రట్టయ్యింది. విచారణలో చోరీ చేసినట్లు అమీనుల్ హక్ అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. అతడి నుంచి రూ.2.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌: డీజీపీ

ఓటరన్న కరుణించేదెవరినో..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 10:31 AM