Share News

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌: డీజీపీ

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:39 AM

రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల్లో బుధవారం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌: డీజీపీ
Telangana DGP Shivdhar Reddy

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల్లో బుధవారం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి (Telangana DGP Shivdhar Reddy) పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,188 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, ప్రతి పోలింగ్‌ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షిస్తామని వెల్లడించారు. 1,302 అత్యంత సున్నితమైన, 1,926 సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, అక్కడ స్ర్టైకింగ్‌ ఫోర్స్‌ను మోహరిస్తామని వెల్లడించారు. ఎలాంటి గొడవలు జరగకుండా నిఘా బృందాలు చూసుకుంటాయని తెలిపారు.


రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో 181 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 167 స్ట్రాటజిక్‌ నిఘా బృందాలను రంగంలోకి దించామని, మునిసిపల్‌ ఎన్నికల బందోబస్తులో లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో పాటు వివిధ విభాగాలకు చెందిన 3 వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారని చెప్పారు. 15 రోజుల్లో ఎన్నికల నేరాలకు సంబంధించి 988 కేసులు నమోదు చేసి, రూ.3.09కోట్ల నగదు, మద్యం, డ్రగ్స్‌, బహుమతులు పట్టుకున్నామని తెలిపారు. 4,318మందిని బైండ్‌ ఓవర్‌ చేశామని వివరించారు. ప్రజలు నిర్భయంగా, నిశ్చింతగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించామని తెలిపారు. కాగా, మక్తల్‌ మునిసిపాలిటీలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్‌ ఘటనను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శివధర్‌రెడ్డి స్పందించారు. ఆత్మహత్యపై కేసు నమోదైందని, అక్కడ ఎలాంటి సూసైడ్‌ లేఖ లభ్యం కాలేదని డీజీపీ తెలిపారు.

Updated Date - Feb 11 , 2026 | 07:40 AM