Share News

నరవణే పుస్తకంపై..పెంగ్విన్‌ పొంతన లేని వివరణలు!

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:58 AM

మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం. నరవణే పుస్తకం ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై ఆ పుస్తక ప్రచురణకర్త ‘పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా...

నరవణే పుస్తకంపై..పెంగ్విన్‌ పొంతన లేని వివరణలు!

  • ప్రీ ఆర్డర్‌, పబ్లిష్డ్‌ పుస్తకం ఒకటి కాదని వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం. నరవణే పుస్తకం ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై ఆ పుస్తక ప్రచురణకర్త ‘పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా’ 24 గంటల్లో రెండోసారి వివరణ ఇచ్చింది. ఆ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని పేర్కొంది. తాజాగా ఇచ్చిన ప్రకటనలో.. విడుదల కాబోతున్న పుస్తకం(ఎనౌన్సౌడ్‌ బుక్‌), ప్రి ఆర్డర్‌కు అందుబాటులో ఉన్న పుస్తకం, పబ్లిష్డ్‌ పుస్తకం ఒకటి కాదని పేర్కొంది. మార్కెట్లో అన్నిచోట్ల కొనుగోలుకి అందుబాటులోకి వచ్చినప్పుడే పబ్లి్‌ష్డగా పరిగణించాలని తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో పేర్కొంది. కాగా నరవణే పుస్తకం ప్రచురితం కాకుండానే సర్క్యులేట్‌ అవుతోందని సోషల్‌ మీడియాలో వస్తోన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ ఈమేరకు వివరణ ఇచ్చింది. ప్రచురితం కాని(అన్‌పబ్లిష్డ్‌) పుస్తకం రాహుల్‌గాంధీ వద్ద ఉందని వార్తలు వచ్చిన తర్వాత ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం గమనార్హం. ఈ పుస్తకానికి రక్షణ శాఖ అనుమతి అవసరం. అయితే అనుమతి ఇవ్వలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పార్లమెంటు సముదాయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గత వారం ఆ పుస్తకాన్ని ప్రదర్శించినప్పటి నుంచి దీనిపై వివాదం మొదలైంది. కాగా మాజీ ఆర్మీ చీఫ్‌ నరవణే తన పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ ఈ వివాదంపై ఇచ్చిన ప్రకటనను సమర్థించారు. ‘‘ఇదే ఆ పుస్తకం స్థితి’’ అని ఎక్స్‌లో మంగళవారం పేర్కొన్నారు. పెంగ్విన్‌ ప్రకటనను దాంతో షేర్‌ చేశారు.

Updated Date - Feb 11 , 2026 | 01:58 AM