Share News

నెయ్యి ట్యాంకర్ల నుంచి లంచాలు..

ABN , Publish Date - Feb 11 , 2026 | 04:22 AM

తిరుచానూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కాంట్రాక్టు ఉద్యోగి తంబూరు రాధాకృష్ణపై వేటు పడింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి వెళ్లే నెయ్యి ట్యాంకర్ల నుంచి లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయన్ను ...

నెయ్యి ట్యాంకర్ల నుంచి లంచాలు..

  • తిరుచానూరు మార్కెట్‌ కమిటీ ఉద్యోగిపై వేటు

  • వైష్ణవి డెయిరీ లావాదేవీలపై లోతైన విచారణ

తిరుపతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కాంట్రాక్టు ఉద్యోగి తంబూరు రాధాకృష్ణపై వేటు పడింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి వెళ్లే నెయ్యి ట్యాంకర్ల నుంచి లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు తిరుచానూరు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి హరికిషోర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాధాకృష్ణ వైసీపీ హయాంలో ఆరు నెలల వ్యవధిలోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచి రూ.3.68 లక్షలు లంచంగా వసూలు చేశాడు. తిరుపతిలోని అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద మాటు వేసి ఈ దందా నడిపాడు. అసలుకు అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చెక్‌పోస్టు లేదు. అయినా రూ.లక్షలు వసూలు చేసిన రాధాకృష్ణ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వాచ్‌మెన్‌గా నియమితుడైన ఓ చిరుద్యోగి. భోలేబాబా డెయిరీ కమీషన్‌ ఏజెంట్‌ పీపీ శ్రీనివాసన్‌ డెయిరీలో రాధాకృష్ణకు ఇచ్చిన లంచాల వివరాలు సిట్‌ కంటబడ్డాయి. సిట్‌ నివేదిక నేపథ్యంలో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఇప్పటికే తిరుచానూరు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి జానకిరామ్‌ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

వైష్ణవి డెయిరీపై విచారణకు ఆదేశం

మరోవైపు తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక వద్ద ఉన్న వైష్ణవి డెయిరీ ఉత్పత్తుల రవాణాకు సంబంధించిన లావాదేవీలపై వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ లోతైన విచారణకు ఆదేశించింది. సిట్‌ నివేదికతో ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 2023 నవంబరు 21 నుంచి 2024 జూలై 3 వరకు వైష్ణవి డెయిరీ నుంచి వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు సెస్‌ తదితర పన్నుల కింద రూ.57.38 లక్షలు చెల్లింపులు జరిగినట్టు పేర్కొన్నారు.

ఆ ఐదేళ్లలో నెయ్యి కొనుగోళ్ల వివరాల కోసం లేఖ

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సక్రమంగా సెస్‌ చెల్లించాయా? లేదా అన్నదానిపై తాజాగా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ దృష్టి సారించింది. ఆ క్రమంలో 2019-2024 మధ్య చేపట్టిన నెయ్యి కొనుగోళ్ల వివరాలు కోరుతూ టీటీడీకి లేఖ రాసింది.

Updated Date - Feb 11 , 2026 | 04:22 AM