Share News

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. మంత్రుల సమాధానాలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 10:07 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, కస్తూరిబా బాలికా విద్యాలయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానాలు ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. మంత్రుల సమాధానాలు
AP Assembly Session

అమరావతి, ఫిబ్రవరి 19: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో సభను మొదలుపెట్టారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం కోసం రూ.139 కోట్ల నిధులు మంజూరు చేశామని... దాంట్లో రూసా కింద రూ.55 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకుంటున్నామని తెలిపారు. కర్నూలు పార్లమెంట్ చుట్టు పక్కల ఎక్కవ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. క్లస్టర్ యూనివర్సిటీల్లో ఫోకస్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అందుకే స్పెషలైజేషన్‌లపైనా శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాలెన్స్ పనులు వచ్చే అకాడమిక్ ఇయర్‌లో పెండింగ్ నిధులు మంజూరు చేస్తామని మంత్రి లోకేశ్ సభలో పేర్కొన్నారు.


సమగ్ర శిక్షా అభియాన్‌ ఒప్పంద ఉద్యోగాలపై..

సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచే ఉద్దేశం ఉందా అని ఎచ్చెర్ల (శ్రీకాకుళం) ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రశ్నించారు. వీరంతా చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారని తెలిపారు. వారి జీతభత్యాలు పెంచాలని, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పార్థసారధి కస్తూరిబా బాలికా విద్యాలయాలపై మాట్లాడారు. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో ఆడపిల్లలకు గొప్పగా విద్యనందిస్తున్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం 79 శాతం ఉత్తీర్ణత ఉన్న స్కూళ్లు త్వరలో 90 శాతం ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని కస్తూరిబా బాలికా విద్యాలయాలను ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు.


ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎంత వేతనం చెల్లిస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉందని, ఈ అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి లోకేశ్. త్వరలోనే వాటిని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. డీఎస్సీలో కర్నూలు జిల్లాకు అదనపు ఉపాధ్యాయులను శాంక్షన్ చేశామన్నారు. త్వరలోనే డీఎస్సీని జాబ్ క్యాలెండర్ కింద విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.


క్రైస్తవ ఆస్తులపై ప్రశ్న..

గతంలో క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయా అని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తారు. గుంటూరులో క్రిస్టియన్ భవన్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని అడిగారు ఎమ్మెల్యే. దీనిపై మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సమాధానం ఇస్తూ.. క్రైస్తవ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాదని అనుకుంటున్నానని... ఎందుకు ఐదేళ్ల పాటు ఆ క్రైస్తవ భవన్ పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఎందుకు ఆయన తనహయంలో నిధులు ఇవ్వలేదని అడిగారు. ఇప్పుడు కూటమి వచ్చింది కనుక త్వరలోనే పెండింగ్ పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధం జరుగుతున్నందున జెరుసలేం యాత్రకు ఆస్కారం లేకుండా ఉందని మంత్రి ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రఫేల్‌ ఫైటర్లలో.. భారత్‌ వాటా పెంచాలి

హైదరాబాద్‌లో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 12:27 PM