Share News

రఫేల్‌ ఫైటర్లలో.. భారత్‌ వాటా పెంచాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:13 AM

రఫేల్‌ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా 50శాతం వరకు భారత్‌లో తయారైన విడిభాగాలను వినియోగించాలని ఫ్రాన్స్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు.

రఫేల్‌ ఫైటర్లలో.. భారత్‌ వాటా పెంచాలి

  • భారత్‌లో తయారైన విడిభాగాలు 50ు వరకు వాడాలని ఫ్రాన్స్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విజ్ఞప్తి

  • భారత్‌ అనుసరించదు.. నేతృత్వం వహిస్తుంది: మెక్రాన్‌

  • 114 రఫేల్‌ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంపై రాని స్పష్టత

బెంగళూరు/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: రఫేల్‌ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా 50శాతం వరకు భారత్‌లో తయారైన విడిభాగాలను వినియోగించాలని ఫ్రాన్స్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో జరిగిన భారత్‌-ఫ్రాన్స్‌ ఆరో వార్షిక రక్షణ సదస్సులో ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి కేథరీన్‌ వోట్రిన్‌తో 114 రఫేల్‌ ఫైటర్ల కొనుగోలు ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా రఫేల్‌ ఫైటర్ల ఇంజన్లు, వాటి పునరుద్ధరణ (ఓవర్‌ హాలింగ్‌) భారత్‌లోనే జరగాలని, అది మేకిన్‌ ఇండియా ప్రయత్నాలకు తోడ్పడుతుందని రాజ్‌నాథ్‌ కోరినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఈ 114 రఫేల్‌ ఫైటర్ల కొనుగోలుకు సంబంధించి ఇంకా ఒప్పందమేదీ జరగలేదు. మరోవైపు ముంబైలో మోదీతో భేటీ అనంతరం మాట్లాడిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌.. ‘రఫేల్‌ ఫైటర్ల నుంచి జలాంతర్గాముల వరకు రక్షణ సహకారం పెంచుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఫ్రాన్స్‌ నుంచి మరికొన్ని స్కార్పీన్‌ తరహాకు చెందిన జలాంతర్గాములను కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రపంచ సృజనాత్మక రంగంలో భారత్‌ ప్రాభవం పెరుగుతోందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ‘భారత్‌-ఫ్రాన్స్‌ ఇన్నోవేషన్‌ ఫోరమ్‌’ కార్యక్రమంలో ప్రశంసించారు. ‘‘ఆల్ఫాబెట్‌ (గూగుల్‌) సీఈవో భారతీయుడే. మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, అడోబ్‌, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ సీఈవోలు భారతీయులే. ప్రపంచ సృజనాత్మక రంగంలో భారత్‌ కేవలం భాగస్వామి కాదు.. దానిని ముందుండి నడిపిస్తున్న దేశమిది. భారత్‌ ఆవిష్కరణల శక్తి కేవలం ప్రతిభావంతులైన వ్యక్తులలో మాత్రమేకాదు.. ఆ ఆవిష్కరణలను క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి తీసుకెళ్లే సామర్థ్యంలో ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా, మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌కు వచ్చిన మెక్రాన్‌.. రెండో రోజు బుధవారం ముంబైలో ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మిన్‌సను సందర్శించారు. అనంతరం ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో పాల్గొననున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 04:13 AM