అమరావతి పేరు వింటేనే జగన్ విషం కక్కుతున్నారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:33 AM
రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు.
అమరావతి, ఏప్రిల్ 2: ఎన్డీఏ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఈరోజు(గురువారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు ఒక చరిత్రాత్మక దినంగా నిలుస్తోందని తెలిపారు. రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోందని.. కేంద్ర సహకారంతో పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతోందని అన్నారు. అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిందని సీఎం తెలిపారు.
జగన్ వైఖరి మారదు...
‘అమరావతి మనకు ఒక సెంటిమెంట్. 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారు... అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్ట. అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరు. అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారు. గతంలోనూ ‘ఎస్ఆర్ఎం అమరావతి’ అని పేరు ఉంటే... ఎస్ఆర్ఎంగా మార్పించారు. అమరావతి పేరు వింటేనే జగన్‌కు కంపరంగా ఉండి నిత్యం విషం కక్కుతున్నారు. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైంది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
సంబరాలు జరుపుకునే సమయం...
మా రాజధాని అమరావతి అని ప్రతీ ఒక్కరిలో భావన రావాలని ముఖ్యమంత్రి తెలిపారు. బిల్లును ఆమోదించి చేయూతనిచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తయినట్లే అని చెప్పుకొచ్చారు. బిల్లు పాస్ అయినందుకు ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరుపుకునే సమయమిది అని అన్నారు. ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరూ కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వెళ్తున్నట్లు తెలిపిన సీఎం.. అక్కడ రాజధాని సంబరాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ పుణ్యస్థలాల నుంచి తెచ్చిన నీళ్లు, మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతం ఉద్దండరాయునిపాలెం అని ముఖ్యమంత్రి తెలిపారు.
సంకల్పం తీసుకుందాం...
‘మనం అనుకున్న అభివృద్ధి సవ్యంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి... సంకల్పం తీసుకోవాలి. మన రాజధానికి స్థిరత్వం వచ్చేలా సహకరించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, మద్ధతు తెలిపిన వారికి కృతజ్ఞతలు. గత ఐదేళ్లు మీకు 3 రాజధానులా అని ఎగతాళిగా మాట్లాడారు. ఏకైక రాజధాని అమరావతి అని గౌరవంగా చెప్పుకునే రోజు వచ్చింది. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కూడా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేస్తాం. అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోంది’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. బిల్లు ఆమోదం సంతోషకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధించిన విజయంగా అభివర్ణించారు. సాయంత్రం నిర్వహించే కేంద్రానికి మద్ధతు తెలిపే కార్యక్రమాల్లో జనసేన, బీజేపీ పాల్గొంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్, మాధవ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో విషాదం.. ఆడిషన్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల
Read Latest AP News And Telugu News