Share News

వైఎస్ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి చురకలు

ABN , Publish Date - May 26 , 2026 | 05:12 PM

తనను కొనడం వైఎస్ అవినాష్ రెడ్డి వల్ల కాదు కదా.. ఆయన సోదరుడు వైఎస్ జగన్ వల్ల కూడా కాదని పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి ఫైర్ అయ్యారు.

వైఎస్ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి చురకలు
TDP Leader BTech Ravi

కడప, మే26: తనను కొనడం వైఎస్ అవినాష్ రెడ్డి వల్ల కాదు కదా.. ఆయన సోదరుడు వైఎస్ జగన్ వల్ల కూడా కాదని పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి ఫైర్ అయ్యారు. డబ్బు మీద వ్యామోహం, డబ్బు మీద కక్కుర్తి కానీ తనకు లేదని.. అది మీకు మాత్రమే ఉందంటూ వైఎస్ అవినాశ్ రెడ్డి సోదరులకు ఆయన చురకలంటించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం బీటెక్ రవిపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంగళవారం కడపలో బీటెక్ రవి స్పందించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి విలేకర్లతో మాట్లాడుతూ.. అమరావతి తీర్మానానికి మద్దతు ఇవ్వకుంటే రూ.15 కోట్లు ఇస్తామని చెప్పింది మీరు కదా? అని కడప ఎంపీని ఆయన సూటిగా ప్రశ్నించారు.


తాను గతంలో విజయ సాయిరెడ్డిని కలిసి ఉంటే గత ఆరు సంవత్సరాలుగా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ వారిని ఈ సందర్బంగా బీటెక్ రవి నిలదీశారు. 2014లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి తనను ఉల్లిమెళ్లలోని తన తోట వద్దకు పిలిపించి కసునూరు ఎంపీటీసీ అంశంపై ఎందుకు చర్చించారన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అంశంలో హైకోర్టులో సీబీఐ కేసును విత్‌డ్రా చేయడానికి తనతోపాటు ఆదినారాయణ రెడ్డికి బ్లాంక్ చెక్ ఆఫర్ చేయడం నిజం కాదా? .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని క్యాంపుల్లోని అసంతృప్తుల వివరాలను తమకు చెప్పింది మీరు కాదా? అంటూ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ సందర్భంగా బీటెక్ రవి ప్రశ్నలు సంధించారు.


రాజశేఖర రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత బీబీఎమ్‌కు వచ్చిన వర్క్‌ను రద్దు చేయించి.. తద్వారా రూ.15 కోట్ల కమీషన్ తీసుకుని ఇళ్లు కట్టుకున్నది మీరని బీటెక్ రవి కుండబద్దలు కొట్టారు. అలాంటి నువ్వు.. నాపై మాట్లాడేదంటూ అవినాశ్ రెడ్డిపై బీటెక్ రవి నిప్పులు చెరిగారు. అరటి రైతుల కడుపు కొట్టి కమీషన్‌లు తీసుకున్న నేపథ్యం మీదంటూ అవినాష్ రెడ్డి తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.


సీఐ రాజేశ్వర్ రెడ్డి, గణకణపల్లి కృష్ణారెడ్డిలను అడిగితే మీ ఎర్రచందనం దొంగతనాల గురించి వివరిస్తారన్నారు. మీ తాటాకు చప్పుడులకు తాను భయపడేది లేదంటూ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి స్పష్టం చేశారు. ఉలిమెళ్ల తోటలో ఏం జరగలేదని చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ అవినాష్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పటివరకు పుష్ప 1 మాత్రమే అయింది.. ఇంకా పుష్ప 2, పుష్ప 3 కూడా చూపిస్తామని అవినాష్ రెడ్డిని బీటెక్ రవి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2026 | 05:53 PM