లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ
ABN , Publish Date - May 26 , 2026 | 03:44 PM
లొంగిపోయిన మావోయిస్టులు నరహరి దంపతులకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చెక్కులు అందజేశారు. నరహరికి రూ. 25 లక్షలు, ఆయన భార్య ధనమ్మకు రూ. 20 లక్షల చెక్కును డీజీపీ సీవీ ఆనంద్ అందజేశారు.
హైదరాబాద్, మే 26: మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాల పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పని చేశారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మీడియా ఎదుట నరహరితోపాటు ఆయన భార్య ధనమ్మను తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టారు. లొంగిపోయిన వారిద్దరికి రూ. 25 లక్షలు, రూ.20 లక్షలు చొప్పున డీజీపీ చెక్కులు అందజేశారు. అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 47 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. అందులో తెలంగాణాకి చెందిన వారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఒకరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 15, జార్ఖండ్ 13, ఒడిశాకు చెందిన 15 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని వివరించారు.
2024 నుండి ఇప్పటి వరకు 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. మొత్తం 334 ఆయుధాలతో వీరంతా తెలంగాణా పోలీసులు ఎదుట లొంగిపోయారని చెప్పారు. ఇక తెలంగాణా పోలీసులు ముందు లొంగిపోయిన ఒడిశాకి చెందిన మావోయిస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టులను త్వరలో వారి ప్రాంతాలకు వెళ్లి స్వయంగా కలుస్తానని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
తెలంగాణాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ గణపతితోపాటు జాడే రత్న బాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు లొంగిపోవాలని ఈ సందర్భంగా వారికి డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. మీరు లొంగిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్‌తోపాటు సదుపాయాలు కల్పిస్తామని అజ్ఞాతంతో ఉన్న మావోయిస్టులకు డీజీపీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మే 12వ తేదీన పోలీసుల ఎదుట నరహరి, ఆయన భార్య లొంగిపోయారు. వారిని ఈ రోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. 2026, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ సందర్భంగా వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అలాగే పలువురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు నిరంతరాయంగా చేపట్టిన కూంబింగ్ కారణంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఇక ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు అందజేశారు. దీంతో దేశంలో దాదాపుగా మావోయిస్టు పార్టీ ప్రాబల్యం దాదాపుగా తగ్గిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం
అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష.. ఇప్పటికి 16 సార్లు పెరోల్..
Read Latest Telangana News And Telugu News