‘హైబ్రిడ్’ మహానాడు సూపర్ హిట్!
ABN , Publish Date - May 29 , 2026 | 04:57 AM
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు చర్యలకు అనుగుణంగా టీడీపీ నాయకత్వం చేపట్టిన ‘హైబ్రిడ్’ మహానాడు విజయవంతమైంది.
24.5 లక్షల మంది హాజరుతో రికార్డు.. మహిళా రిజర్వేషన్ సహా 21 తీర్మానాలు
లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి మహానాడు
సవాల్‌గా తీసుకున్న యువనేత
వర్చువల్ కార్యక్రమం భారీ సక్సెస్
అటు క్యాడర్‌లో జోష్.. నాయకులకు నిర్దేశం
కూటమి ఐక్యత కోసం రాజకీయ తీర్మానం
అమరావతి, మే28 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు చర్యలకు అనుగుణంగా టీడీపీ నాయకత్వం చేపట్టిన ‘హైబ్రిడ్’ మహానాడు విజయవంతమైంది. కనీవినీ ఎరుగని రీతిలో సూపర్‌హిట్ అవ్వడంతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు..నాయకులకు నడుమ బంధం బలోపేతం అవడానికి ఈ రెండ్రోజుల కార్యక్రమం వేదికగా నిలిచింది. గత మహానాడలకు భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడుకు రికార్డు స్థాయిలో 24.50 లక్షల మంది కార్యకర్తలు వర్చువల్‌గా హాజరయ్యారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని దేశప్రజలందరినీ కోరారు. దీంతో మహానాడును బహిరంగంగా అట్టహాసంగా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగని పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే కార్యకర్తల్లో పెద్దగా ఉత్సాహం కనిపించదు. పైగా క్షేత్రస్థాయిలో మినీ మహానాడులు అప్పటికి జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం.. అటు బహిరంగ నిర్వహణ అనుభూతిని శ్రేణులకు కలుగజేస్తూనే.. మరోవైపు పటాటోపం లేకుండా పొదుపు చర్యలు పాటించేలా హైబ్రిడ్ మహానాడుకు శ్రీకారం చుట్టింది. తొలుత స్పందన ఎలా ఉంటుందోనని పార్టీ పెద్దలు ఆందోళనకు గురయ్యారు. అయితే వారి ఆందోళనలను పటాపంచలు చేస్తూ 24.50లక్షల మంది హాజరయ్యారు. పార్టీ నాయకత్వాన్నే ఆశ్చర్యచకితులను చేశారు.
నూతన విధానంపై సంతృప్తి..
సాధారణంగా మహానాడును పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా ఎక్కడో ఒక చోట మే 27, 28, 29 తేదీల్లో భారీఎత్తున నిర్వహించడం ఆనవాయితీ. నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పోటెత్తుతారు. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో హైబ్రిడ్ మహానాడు నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీల ముఖ్యనేతలు మహానాడును నిర్వహించగా.. దానిని రాష్ట్రం నలుమూలల నుంచీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గానికి 10 నుంచి 12 క్లస్టర్లలో నిర్వహించడంతో ఎక్కడికక్కడ స్థానిక నేతలతో కార్యకర్తలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ తమ కష్టనష్టాలను ఏకరువు పెట్టే అవకాశం దొరికింది.
కూటమిగానే ప్రయాణం..
టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపుతూనే నాయకులకు దిశానిర్దేశం చేస్తూ రెండ్రోజుల మహానాడు గురువారం విజయవంతంగా ముగిసింది. ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రకటనతో తొలిరోజే యువనేత లోకేశ్ సంచలనం రేకెత్తించగా.. తన సహజ శైలికి భిన్నంగా అధినేత చంద్రబాబు పంచ్ డైలాగులతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. మహానాడులో మొత్తం 21 తీర్మానాలను ఆమోదించారు. రెండోరోజు ప్రవేశపెట్టిన కీలక రాజకీయ తీర్మానం.. కూటమి పార్టీలతో కలిసి ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకతను పార్టీ శ్రేణులకు స్పష్టంగా వివరించింది. ‘రాష్ట్ర ప్రజల క్షేమం కోరి విశాల దేశ ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో ఎన్డీయేతో మనం జతకట్టాం. ఎన్డీయేతో గతంలోనూ కలిసి పనిచేశాం. రాష్ట్రంలో విధ్వంసకర పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రజలు కూటమికి రికార్డు స్థాయిలో 164 స్థానాలిచ్చారు. రెండేళ్లలో కూటమి మైత్రీ బంధం మరింత బలపడింది. మున్ముందు ఈ ప్రయాణం ఇలాగే సాగాలి. కూటమి ఐక్యతకు, పాలన జనరంజకంగా సాగడానికి జనసేనాని పవన్ కల్యాణ్ అందిస్తున్న సంపూర్ణ మద్దతు మరువలేనిది’ అని తీర్మానంలో స్పష్టం చేశారు. కూటమి సఖ్యతకు విఘాతం కలిగించేలా ఎవ్వరూ పనిచేయవద్దని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు విస్పష్ట సందేశమిచ్చారు.
చాలెంజ్‌గా తీసుకున్న లోకేశ్
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువనేత లోకేశ్ బాధ్యతలు చేపట్టాక జరిగిన మొదటి మహానాడు ఇది. గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా.. తొలిసారి హైబ్రిడ్ తరహాలో జరపాలని నిర్ణయించడంతో ఆయన దీనిని సవాల్‌గా తీసుకుని దిగ్విజయంగా నిర్వహించారు. తన సాంకేతిక నైపుణ్యాన్నే గాక సంస్థాగత పట్టును కూడా నిరూపించుకున్నారు. కాగా.. హైబ్రిడ్ మహానాడు సూపర్‌హిట్ కావడం టీడీపీ అధిష్ఠానాన్ని ఆలోచనలో పడేంది. భవిష్యత్‌లో భారీ ఎత్తున నిర్వహించాలనుకునే కార్యక్రమాలకు ఇది మార్గం చూపిందని సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.