Share News

స్టీల్ ప్లాంట్ ఘటనపై వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తోంది: మంత్రి నారాయణ

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:08 PM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వివరించారు.

స్టీల్ ప్లాంట్ ఘటనపై వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తోంది: మంత్రి నారాయణ
AP Minister P Narayana

అమరావతి,జూన్ 09: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వివరించారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. బాధితులకు వైద్యం, సహాయ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.


సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌తోపాటు మంత్రులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి పి.నారాయణ చెప్పారు. విశాఖ ఘటనపై వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. వైసీపీ శవ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని ఆ పార్టీ నేతలకు మంత్రి నారాయణ హితవు పలికారు. 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.


గ్రీవెన్స్ సెల్‌కు 56 మంది ఫిర్యాదుదారులు వచ్చారని మంత్రి పి.నారాయణ వివరించారు. ఈ ఫిర్యాదుల్లో 60 శాతానికిపైగా రెవెన్యూ సమస్యలే ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అవకతవకల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు వారానికి ఒకసారి సమీక్ష నిర్వహిస్తున్నారని వివరించారు. రెవెన్యూ అంశాల పరిష్కారానికి మంత్రుల కమిటీ పని చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ గుర్తు చేశారు.


గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులకు పంపించామని మంత్రి నారాయణ తెలిపారు. ఇక పెన్షన్లు, మున్సిపల్ సమస్యలు, కుటుంబ వివాదాలపై కూడా ఫిర్యాదులు అందాయని వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి నేరుగా జిల్లా కలెక్టర్లతోపాటు కమిషనర్లతో మాట్లాడామని మంత్రి నారాయణ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 03:19 PM