Share News

గుంటూరులో హైటెన్షన్ .. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్..

ABN , Publish Date - Jan 31 , 2026 | 07:35 PM

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు కన్నెర్రజేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు..

గుంటూరులో హైటెన్షన్ .. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్..
TDP Reaction On Ambati Rambabu

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై.. వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అంబటి రాంబాబు వెంటనే సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అభిమానులు ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.


కఠిన శిక్ష పడాల్సిందే..

అంబటి రాంబాబుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు వీధి రౌడీ కంటే దారుణంగా మాట్లాడారని, అంబటి లాంటి వ్యక్తులు సమాజానికి చీడ పురుగులని ధ్వజమెత్తారు. చంద్రబాబును దారుణంగా దూషించిన అంబటికి కఠిన శిక్ష పడాల్సిందేనన్నారు. దిగజారి బూతులు మాట్లాడడం వైసీపీ నేతలకు అలవాటని మంత్రి అనగాని మండిపడ్డారు.


దిష్టిబొమ్మ దహనం..

వయసుకి.. పదవికి గౌరవం ఇవ్వలేని స్థాయికి దిగజారిపోవడమేనా అంబటి రాంబాబు నేర్చుకున్న రాజకీయం అంటూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ధ్వజమెత్తారు. నర్సీపట్నంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తెలుగు భాషపై అదుపుతప్పి, బూతులు మాట్లాడే వారిపై కొత్త చట్టం తేవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.


వైసీపీ నాయకులు రాజకీయాలకు అనర్హులు..

సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను మంత్రి సవిత ఖండించారు. చంద్రబాబు మాతృమూర్తిని దూషించడం క్షమించరాని నేరమని, తక్షణమే అంబటి రాంబాబును అరెస్టు చేయాలన్నారు. వైసీపీ నాయకులు రౌడీల్లా చెలరేగిపోతున్నారని.. జగన్, వైసీపీ నాయకులు రాజకీయాలకు అనర్హులని మంత్రి పేర్కొన్నారు. తక్షణమే వైసీపీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలని వ్యాఖ్యనించారు.


అచ్చోసిన ఆంబోతుల్లా అసత్యాలు..

పశువులు కూడా సిగ్గుపడేలా.. అంబటి రాంబాబు బరితెగించి మాట్లాడారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. ఆయన మాటలు క్షమించరానివని అన్నారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. అచ్చోసిన ఆంబోతుల్లా అసత్యాలు ప్రచారం చేస్తారా ? అని మండిపడ్డారు. హద్దూఅదుపూ లేకుండా బూతులతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సభ్యసమాజం సహించకూడదన్నారు. రాజకీయాలు దిగజారిపోయాయి అనడానికి అంబటి మాటలే నిదర్శనమని మండిపడ్డారు. ఇటువంటి బూతుల పంచాంగం భవిష్యత్తులో ఎవరూ మాట్లాడకుండా సుమోటోగా కేసు నమోదు చేసి.. శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.


Also Read:

నేను ఇంత పెద్ద వయస్సులో అలా మాట్లాడకుండా ఉండాల్సింది: అంబటి రాంబాబు

జగన్ హయాంలో నల్లచట్టం తెచ్చారు: సీఎం చంద్రబాబు

For More Latest News

Updated Date - Jan 31 , 2026 | 09:09 PM