నారా భువనేశ్వరి బృందానికి అభినందనలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:08 PM
ఎన్టీఆర్ ట్రస్ట్.. సేవలకు మారు పేరు. ఈ ట్రస్ట్ నేటితో 30వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో పాటు ఆమె బృందానికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 15: దశాబ్దాల క్రితం స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు.. సమాజ సేవే పరమావధిగా నేటికీ కొనసాగుతున్నాయి. అలాంటి ఈ ట్రస్ట్ నేడు.. అంటే ఆదివారం శివరాత్రి పర్వదినం వేళ 30వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ ఖాతా వేదికగా ఇలా స్పందించారు. 'తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పరితపించిన మహనీయుడు, అధికారం అంటే పేదల సేవ అని భావించిన నాయకుడు.. నందమూరి తారక రామారావు గారి ఆశయాలను, సేవలను కొనసాగించేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్థానం సాగుతోంది. ట్రస్ట్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను' అని అన్నారు.
'ప్రజా సేవకు నిజమైన అర్థాన్నిచ్చిన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించిన ఆయన బాటలో సేవలు కొనసాగిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సాయం వంటి కార్యక్రమాలతో.. సమాజంలో ట్రస్ట్ తనదైన ముద్ర వేసింది. తలసీమియా వ్యాధిగ్రస్థులైన చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యం. మహిళా సాధికారతలో, జీవనోపాధి కల్పనలోనూ ఈ ట్రస్ట్ విశిష్ట సేవలందిస్తోంది' అని సీఎం చెప్పారు.
'ప్రజలకు, కష్టాల్లో ఉన్నవారికి మరింత చేరువయ్యేలా ట్రస్ట్ సేవలను విస్తరిస్తూ.. అత్యంత సమర్థవంతమైన సేవలను ఇచ్చే సంస్థగా ట్రస్ట్‌ను నడుపుతున్న.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి, వారి బృందానికి అభినందనలు. ట్రస్ట్ కార్యక్రమాలకు వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేయర్ పీఠం కాంగ్రెస్‌దే: పొన్నం ప్రభాకర్
రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
For AP News And Telugu News