కూలగొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం: మంత్రి నిమ్మల
ABN , Publish Date - May 28 , 2026 | 06:02 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు.
గుంటూరు, మే 28: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు రాజధాని అమరావతిలో రెండో రోజు నిర్వహించిన మహానాడులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నీటిపారుదల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీకి ముందు ఆ తర్వాతే అని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుపెట్టాలి.. ఎప్పుడు పూర్తి చేయాలో సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టారని వివరించారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్లల చేయలేని పనులు 23 నెలల్లో చేశామని వివరించారు. చెప్పిన మాట ప్రకారం.. హంద్రీనివా పనులు పూర్తి చేసి తొలి ఏడాదిలోనే 727 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి కృష్ణాజలాలు తీసుకెళ్లామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది జూన్‌లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక, ఏపీ సీఎంలు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారని తెలిపారు. కేవలం 22 నెలల్లోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ. 2,250 కోట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పూర్తికానీ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని మోసం, దగా చేశాడంటూ వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రూ. 203 కోట్లతో శ్రీశైలం డ్యాం మరమ్మతులు చేపట్టామన్నారు.
23 నెలల్లో భారీ నీటిపారుదల శాఖలో రూ. 23 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు షెడ్యూల్ విడుదల చేశారన్నారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ప్రకటించారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమ పూర్తి చేస్తే, 439 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని సృష్టించిందని వివరించారు. కూలగొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజమని అభివర్ణించారు. రాయలసీమకు ఎందుకు వెన్నుపోటు పొడిచాడో చెప్పాలంటూ వైఎస్ జగన్‌ను మంత్రి నిమ్మల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన: సీఎం చంద్రబాబు
ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని
For More AP News And Telugu News