ఒకేసారి రెండు తుపాన్లతో ఏపీకి భారీ నష్టం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:43 PM
ఓ వైపు ఎల్‌నినో.. మరోవైపు ఒకే సారి రెండు తుపాన్లు రావడం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ నష్టం కలిగిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుపాను గమనాన్ని ముందే అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.
అమరావతి, నవంబర్15: ఓ వైపు ఎల్‌నినో.. మరోవైపు ఒకే సారి రెండు తుపాన్లు రావడం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ నష్టం కలిగిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుపాను గమనాన్ని ముందే అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆదివారం రాజధాని అమరావతిలో మురసు తుపాను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో ఆయన వర్చువల్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తుపాను నష్టంపై కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుపాను తదనంతరం యుద్ధ వేగంతో సహాయక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రహదారులు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ వంటివి 24 గంటల్లోనే పునరుద్ధరించగలిగామని అన్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు. పంట నష్టపోయిన రైతులకు బీమా సాయం త్వరగా అందేలా పని చేస్తున్నామని పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అదనపు రేషన్ కూడా అందించామని గుర్తు చేశారు. కోస్తాంధ్ర ప్రాంతం తరచూ తుపాన్లు ఎదుర్కొంటూనే ఉందని తెలిపారు. తుపాను నష్టాన్ని తగ్గించేలా శాశ్వత పరిష్కారంగా మౌలిక వసతులు మరింత ధృఢంగా నిర్మించాలని.. దీనికి కేంద్ర సాయం కావాలని ఆ బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 10 రోజుల్లో తుపాను నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించాలని ఆయా బృందాలకు విజ్ఞప్తి చేశారు. తక్షణమే తుపాను సాయాన్ని అందించాలని ఈ సందర్భంగా కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
మురసు తుపాను నష్టంపై అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. వారు రెండు బృందాలుగా విడిపోయి.. బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించాయి. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలు, రహదారులు, ఇళ్లు పరిశీలించాయి. బాపట్ల, జమ్మలపాలెం, చీరాల, చిన్నగంజాం, పర్చూరు, నిడమర్రు, ఉంగుటూరు, చిలకలూరిపేట, గౌరీపట్నం సహా దాదాపు 60 ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించాయి. భీమడోలు మండలం సూరప్పగూడెంలో పంట నష్టంపై నేరుగా రైతులతో ఈ బృందం సభ్యులు మాట్లాడారు.
రావులపర్రులో డ్రెయినేజీ, వరి పంటలను పరిశీలించారు. కునకలమర్రులో కొమ్ము కాలవ, రహదారులు, సాగునీటి వ్యవస్థను పరిశీలించారు. చీరాలలో మత్స్యకారుల పడవలకు జరిగిన నష్టంపై ఆరా తీశారు. బొప్పూడిలో పక్కా ఇళ్లు, ఉద్యాన పంటలు, వ్యవసాయం, బాతుల పెంపకందారులకు జరిగిన నష్టం గురించి వివరాలను స్వయంగా ఆయా బృందాలు అడిగి తెలుసుకున్నాయి. యడ్లపాడు - తుర్లపాడు మధ్య జలాది మీదుగా ఉన్న ఆర్ అండ్ బీ రహదారులను పరిశీలించాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయా బృందాలు పరిశీలించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుకు ఈ రోజు వివరించాయి.
సీఎం చంద్రబాబుకు వివరించిన అంశాలు..
రహదారులకు భారీ నష్టం జరిగింది.. ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్‌లతో గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి.
విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.
పత్తి తదితర వాణిజ్య పంటలకు బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు బీమా చేసుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా కాలువలు, వాగుల్లో పూడికతీత వంటి పనులు చేయడంతో నష్టం చాలా వరకు తగ్గింది. గ్రామాల్లో కచ్చా ఇళ్లు తుపాను కారణంగా దెబ్బతిన్నాయి.
30 రోజుల్లో మూడు సార్లు రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఫ్రీ స్కూల్ యూనిఫామ్స్ అందజేయాలి.
ఆదిమ గిరిజనులపైనా ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించింది.. వారిని ప్రత్యేకం ఆదుకోవాల్సి ఉంది.
ఆర్గానిక్ పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసి నష్టపోయిన వారికి అధిక సాయం అందించాలి.
అర్నబ్ కన్నా మురుసు తుపాను వల్ల భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో నష్టం ఎక్కువ జరిగింది.
వరి పంటకు తూర్పు గోదావరి జిల్లాలో 80 శాతం, ఏలూరు జిల్లాలో 90 శాతం వరకు నష్టం వాటిల్లింది.
హార్టీకల్చర్ పంటల్లో మామిడి, బొప్పాయి పంటలు అధికంగా దెబ్బతిన్నాయి.
కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక..
మురసు తుపాను వల్ల దాదాపు రూ.2484.43 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అంచనాలతో నివేదిక అందించింది.
ఈ తుపానుతో1,385 కిలో మీటర్ల రహదారులు, 36 చోట్ల గండ్లు, 65 కల్వర్టులు దెబ్బతిన్నాయి. వాటి వల్ల రూ.888.84 కోట్ల నష్టం వాటిల్లింది.
1,43,617 హెక్టార్లలో రూ.874.97 కోట్ల పంట నష్టం వాటిల్లగా.. దీని వల్ల 1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారు.
6,756 హెక్టార్ల ఉద్యాన పంటలకు రూ.337.10 కోట్ల నష్టం జరిగింది. దీని వల్ల 12,605 మంది రైతులు ప్రభావితమయ్యారు.
369 సాగునీటి వనరులు, 509 చోట్ల గండ్లు పడ్డాయి.
గ్రామీణ ప్రాంతాల్లో 220 కి.మీ. మేర 114 రహదారులు దెబ్బతిన్నాయి.
10,192,11 కేవీ విద్యుత్ స్తంభాలు, 6,442 ఎల్‌టీ స్తంభాలు, 1,448 డీటీఆర్‌లు దెబ్బతిన్నాయి.
అత్యవసర సహాయక చర్యల వ్యయం రూ.37.00 కోట్లు.
3,859 ఇళ్లు, వీటిలో 645 గుడిసెలు దెబ్బతిన్నాయి.
వైద్య ఆరోగ్యం, మత్స్యశాఖ, పురపాలక శాఖ, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పాఠశాలలు, పశుసంవర్ధక, చేనేత తదితర రంగాలకు నష్టం వాటిల్లింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏఈఐ ర్యాంకింగ్‌లో ఏపీకి జాతీయ స్థాయిలో రెండో స్థానం: పట్టాభిరామ్
స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: ఏపీ బీజేపీ చీఫ్
For More AP News And Telugu News