వదంతుల కారణంగానే ఇబ్బందులు తలెత్తాయి: మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:40 PM
వదంతుల కారణంగా ఒకే సారి ఐదు లక్షల గ్యాస్ బుకింగ్‌లు కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ, మార్చి31: వదంతుల కారణంగా ఒకే సారి ఐదు లక్షల గ్యాస్ బుకింగ్‌లు కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం గ్యాస్, ఆయిల్ డీలర్లు, ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహన్ సమావేశమయ్యారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. సరఫరా విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. డొమెస్టిక్ గ్యాస్‌కు సంబంధించి 16 ఏజెన్సీల నుంచి డెలివరీ విషయంలో జాప్యం జరుగుతుందని వివరించారు.
ఈ సమస్యలను వెంటనే నివారించాలని వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే 146 గ్యాస్ ఏజెన్సీలపై సెక్షన్ 6 ఏ కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. అందుకు సంబంధించి 4 వేలకుపైగా గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మూడు ఆయిల్ కంపెనీలతో ప్రతిరోజూ మాట్లాడి గ్యాస్ కొరత లేకుండా చేస్తున్నామని తెలిపారు. మంగళవారం నుంచి కమర్షియల్ గ్యాస్ వినియోగానికి 70 శాతం వరకు సరఫరా చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు.
గృహ వినియోగానికి నగరాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల తర్వాత గ్యాస్ బుక్ చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ నిల్వలపై ఇప్పటికే సమీక్షించామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పుష్కలంగా ఉందని తెలిపారు. 7,900 లీటర్ల పెట్రోల్, 20 వేల లీటర్ల డీజిల్ మనకు రోజు వారీ అవసరంగా ఉందని చెప్పారు. ఈ సమస్య వచ్చిన తర్వాత డీజిల్ 8 శాతం, పెట్రోల్ 2.5 శాతం వినియోగం పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎటువంటి కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.
ఏజెన్సీలు, గోడౌన్ల వద్దకు వెళ్లి హడావుడి చేయవద్దని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్న అనంతరం వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారానే గ్యాస్ డెలివరీ జరుగుతుందని స్పష్టం చేశారు. గల్ఫ్‌లో యుద్ధం కారణంగా ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమర్షియల్ గ్యాస్ వినియోగించే వారు జిల్లాల్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.
కమర్షియల్ గ్యాస్ విషయంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఆసుపత్రుల వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 17 రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేనంతగా గ్యాస్, ఆయిల్ నిల్వలు ఉన్నాయన్నారు. ఎల్.పి.జి, పెట్రోల్, డీజీల్‌పై ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రోజుకు 2.30 లక్షల నుంచి ఎల్.పి.జి గ్యాస్ పంపిణీ 2.70 లక్షలకు పెరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. గ్యాస్ పైప్ లైన్ అవకాశమున్న ప్రాంతాలలో.. ఎల్.పి.జి నుంచి పైపుడ్ నాచురల్ గ్యాస్‌కు మారాలని ప్రజలను ఈ సందర్భంగా కోరారు. మూడు నెలల్లో లక్ష మంది వినియోగదారులకు ఈ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ వైపు తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దీపం పథకం కింద ఉన్న వారికి అవగాహన కల్పించి పి.ఎన్.జి వైపు మారేలా చేస్తామన్నారు.
సోషల్ మీడియా ప్రభావంతో అనేక వదంతుల కారణంగా ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఎల్.పి.జి వినియోగదారులను పి.ఎన్.జి వైపు మళ్లించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు
రాష్ట ప్రజల శాశ్వత రాజధానిగా అమరావతి: టీడీపీ ఎంపీలు
Read Latest AP News And Telugu News