Share News

రాష్ట ప్రజల శాశ్వత రాజధానిగా అమరావతి: టీడీపీ ఎంపీలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:34 PM

రాష్ట ప్రజలకు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. బుధవారం పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనున్నారని తెలిపారు.

రాష్ట ప్రజల శాశ్వత రాజధానిగా అమరావతి: టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, మార్చి 31: రాష్ట ప్రజలకు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. బుధవారం పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ఈ బిల్లు ద్వారా రాజధాని రైతులకి మరింత భరోసా వస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు నమ్మకంతోనే.. రాజధానికి భూములు ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రం అర్థం చేసుకుందని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రాజధానిని అడ్డుకోవాలని చూసిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి రాజధానికి 30 వేల ఎకరాలు కేటాయిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని గుర్తు చేశారు.


జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినా? రాకపోయినా రాష్ట్ర ప్రజలు పట్టించుకోరని శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు క్లారిటీ లేదని విమర్శించారు. ఎక్కడ ఏం మాట్లాడతారో వారికే తెలియదని మండిపడ్డారు. రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసీపీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తుచేశారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాజధానిపై మాట్లాడుతున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు రైతులకు మాటిచ్చారని.. ఇప్పుడు దానిని నిలబెట్టుకున్నారని వివరించారు. ఏపీ పునర్విభజన చట్టంపై తాను పార్లమెంటులో ఇప్పటివరకు 20 సార్లకు పైగా మాట్లాడానని ఎంపీ చెప్పారు.


జగన్‌కు చెంపపెట్టు: ఎంపీ కలిశెట్టి

లోక్‌సభకు రాజధాని అమరావతి బిల్లు రాబోతుందని.. ఇది ఒక ఆంధ్రుడిగా తనకు గర్వంగా ఉందని విజయనగరం ఎంపీ కె.అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని 30 వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారని వివరించారు. 2014లో సీఎం చంద్రబాబు పిలుపునిస్తే రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలా జరగలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భూసేకరణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని.. రాజధాని సైతం వారి హయంలోనే గుర్తిస్తున్నారని ఎంపీ వివరించారు.


అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం ఎన్నో కుట్రలు చేశారని విమర్శించారు. వైసీపీ నేతలు సైతం రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేతకు ఇది చెంపపెట్టు లాంటిదన్నారు. రాజధాని అమరావతిపై జగన్ తన వక్రబుద్ధి చూపించారని చెప్పారు. అమరావతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోందని విశ్వాసం వ్యక్తం చేశారు.


సీఎం చంద్రబాబు దార్శనికత(విజన్) అందరికీ తెలుసన్నారు. రాజధాని బిల్లు వెనక్కు వస్తుందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ కాదు కాదా.. ఎవరొచ్చినా రాజధాని అమరావతిని అడ్డు కోలేరని ధీమాతో చెప్పారు. శాశ్వతంగా అమరావతి చట్టం అవుతుందని పేర్కొన్నారు. రాజధాని కోసం ప్రాణత్యాగం చేసిన రైతులకు ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంపీ అప్పలనాయుడు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరులో సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య

ఆ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 31 , 2026 | 06:33 PM