గ్యాస్ కొరత లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Mar 20 , 2026 | 07:29 PM
రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, గృహ అవసరాలకు ఎక్కడా కొరత లేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రజల్లో అపోహలు, ఆందోళనలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గృహ అవసరాల కోసం ఉద్దేశించిన వంట గ్యాస్ ఎక్కడా కొరత లేదని మంత్రి తెలిపారు. గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఆయిల్ కంపెనీలు కూడా తెలియజేశాయని చెప్పారు. అయితే గ్యాస్‌ను పక్కదారి పట్టించడం, అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించారు. జిల్లాల్లో గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద బుకింగ్స్, డెలివరీలు, పెండింగ్ అంశాలను నిరంతరం సమీక్షించాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద లావాదేవీలు లేదా సరఫరాలో అక్రమాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
మంత్రి మాట్లాడుతూ.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని చెప్పారు. ఈ నెల 21న రావాల్సిన గ్యాస్ నౌక 25న చేరుతుందని కేంద్రం సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అవసరమైనంత మేరకే గ్యాస్ బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికంగా బుకింగ్స్ చేస్తే ఇతరులకు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్స్ ఆన్‌లైన్ ద్వారానే చేయాలని, ఓటీపీ వచ్చిన తర్వాతే బుకింగ్ ఖరారవుతుందని తెలిపారు.
బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే మీడియా కథనాల ఆధారంగా నిఘా పెంచినట్లు చెప్పారు. గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అదేవిధంగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అర్బన్ ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ విధానంపై పని జరుగుతోందని వెల్లడించారు. హోటల్స్, రెస్టారెంట్ల ప్రతినిధులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందుగా పాఠశాల హాస్టల్స్, ఆసుపత్రులకు గ్యాస్ సరఫరా ప్రాధాన్యను బట్టి ఇస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కిరోసిన్ సరఫరాను కూడా అనుమతించిందని, అవసరమైతే రాష్ట్రంలో మళ్లీ వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
Also Read:
పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్
నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు
Read Latest AP News