మొజ్తాబా ఖమేనీ వీడియో విడుదల చేసిన ఇరాన్ ప్రభుత్వ మీడియా
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:25 PM
ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో ఆయన వీడియోను తొలిసారిగా ఇరాన్ ప్రభుత్వ మీడియా శుక్రవారంనాడు విడుదల చేసింది.
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Ayatollah Mojtaba Khamenei) ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో ఆయన వీడియోను తొలిసారిగా ఇరాన్ ప్రభుత్వ మీడియా శుక్రవారంనాడు విడుదల చేసింది. ఇందులో కొందరు విద్యార్థులకు 'రిలీజియస్ సైన్స్'పై అరబిక్‌లో మొజ్తాబా బోధన చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక నిమిషం 19 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్(IRIB) విడుదల చేసింది. అయితే.. ఇది ఎక్కడ రికార్డయిందనేది నిర్ధారణ కాలేదు. చారిత్రక రికార్డు కోసం భద్రపరిచిన వీడియో(Archived Video) కావచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.
'రిలీజియస్ సైన్స్ బోధిస్తున్న అయతుల్లా మొజ్తాబా ఖమేనీ వీడియాను తొలిసారి పబ్లిష్ చేస్తున్నాం' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఐఆర్ఐబీ పోస్ట్ చేసింది.
కొనసాగుతున్న సస్పెన్స్..
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడంతో మొజ్తాబా ఇరాన్ కొత్త సుప్రీంగా ఎన్నికయ్యారు. అయితే అప్పటినుంచి ఆయన ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొజ్తాబా సజీవంగా ఉన్నారో లేదో తాను చెప్పలేనని, ఆయనను చూసినవారు కూడా లేరని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయినట్టు, ఒక కాలు కోల్పోయినట్టు, తీవ్రంగా గాయపడినట్టు, కొందరైతే చనిపోయినట్టు చెబుతున్నారని, అయితే ఆయన 100 శాతం ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం ఎవరూ చెప్పడం లేదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి అలీ మహమ్మద్ నయీని మృతి
అమెరికాకు సైనిక స్థావరాలు ఇవ్వకండి.. ప్రాంతీయ దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి