ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి అలీ మహమ్మద్ నయీని మృతి
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:00 PM
ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్‌కు చెందిన మరో ప్రముఖ వ్యక్తి మృతిచెందారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ ధ్రువీకరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన క్షిపణి దాడుల్లో ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నయీని మృతిచెందారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) శుక్రవారం ధ్రువీకరించింది. దీంతో ఇరాన్ సైన్యంలో మృతిచెందిన ప్రముఖుల సంఖ్య నాలుగుకు చేరింది. అంతకముందు.. ఇవే దాడుల్లో అలీ లారిజాని(ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సన్నిహితుడు), జి.సోలేమాని, నిఘా విభాగానికి చెందిన ఇస్మాయిల్ ఖతీబ్ వంటి ముగ్గురు సీనియర్ అధికారులు మరణించారు.
అలీ మహమ్మద్ నయీని శుక్రవారం తెల్లవారుజామున మరణించినట్లు ఇరాన్‌కు చెందిన ఓ వార్తా సంస్థ సోషల్ మీడియా వేదికగా నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లను వ్యతిరేకిస్తూ నయీని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మా క్షిపణి వ్యవస్థ సమర్థవంతమైనది. దానిపై మాకు ఎలాంటి ఆందోళనా లేదు. అందువల్లే యుద్ధ పరిస్థితుల్లోనూ మేము క్షిపణి ఉత్పత్తిని కొనసాగించగలుగుతున్నాం' అని నయీని అన్నారని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆయనీ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోపే మరణించడం ఇరాన్ సైనిక వ్యవస్థలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
ఎవరీ అలీ మహమ్మద్ నయీని?
మీడియా నివేదికల ప్రకారం.. 1957లో ఇరాన్‌లోని కాషన్‌లో జన్మించిన నయీని.. ఐఆర్‌జీసీలో సెకండ్ బ్రిగేడియర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 2024లో ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్ హస్సెయిన్ సలామీ ఆయన్ను కార్ప్స్ అధికార ప్రతినిధిగా, ప్రజాసంబంధాల ఉపమంత్రిగా నియమించారు. ఆ తర్వాత సాఫ్ట్ పవర్, కాగ్నిటివ్ వార్‌ఫేర్ విభాగంలో ఐఆర్‌జీసీ అగ్రగణ్యులలో ఒకరిగా గుర్తింపుపొందారు నయీని. అంతకముందు ఆయన ఐఆర్‌జీసీ, బసిజ్ రెండింటిలోనూ పలు ప్రభావవంతమైన పదవులను అధిష్ఠించారు.
కాగా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఫిబ్రవరి 28న అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందారు. ఆ తర్వాత ఇరాన్ నాయకత్వంలోని పలువురు ప్రముఖులు మరణించారు. ఇటీవల ఇరాన్ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. అంతలోనే నయీని మృతిచెందారు.
ఇవీ చదవండి:
ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు! చైనా నిర్ణయంతో ప్రకంపనలు