Share News

యూకే వీసా ఫీజుల పెంపు

ABN , Publish Date - Mar 20 , 2026 | 02:06 PM

యూకే వీసా ఫీజులు త్వరలో పెరగనున్నాయి. ఏప్రిల్ 8 నుంచి సవరించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.

యూకే వీసా ఫీజుల పెంపు
UK visa fee hike

ఇంటర్నెట్ డెస్క్: వీసా ఫీజులను మరోసారి పెంచేందుకు యూకే సిద్ధమైంది. పర్యాటక, స్టూడెంట్, స్కిల్డ్‌ వర్కర్ తదితర కేటగిరీల వీసా ఫీజులను ఆరు నుంచి ఏడు శాతం మేర పెంచుతున్నట్టు తెలిపింది. సవరించిన రుసుములు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు యూకే హోమ్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

హోమ్ శాఖ ప్రకటన ప్రకారం.. మూడేళ్ల స్కిల్డ్‌ వర్కర్‌ ఫీజు 769 పౌండ్ల నుంచి 819 పౌండ్‌లకు పెరిగింది. మూడేళ్ల కాలపరిమితికి మించిన దరఖాస్తుల ఫీజు 1,519 నుంచి 1,618 పౌండ్‌లకు పెరిగింది. ఇక స్టూడెంట్ వీసా దరఖాస్తు రుసుము కూడా 524 పౌండ్ల నుంచి 558 పౌండ్‌లకు పెరిగింది. ఆరు నెలల పర్యాటక వీసా దరఖాస్తు ఫీజు 127 పౌండ్ల నుంచి 135 పౌండ్‌లకు యూకే ప్రభుత్వం పెంచింది.


బ్రిటన్‌లోనే వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి వర్తించే రుసుములు కూడా పెరిగాయి. మూడేళ్ల స్కిల్డ్‌ వర్కర్ వీసా ఫీజు 885 పౌండ్ల నుంచి 943 పౌండ్‌లకు పెరిగింది. మూడేళ్లకు మించిన కాలవ్యవధితో దరఖాస్తు చేసే వారు చెల్లించాల్సిన ఫీజు 1,751 పౌండ్ల నుంచి 1,865 పౌండ్‌లకు పెరిగింది. శాశ్వత నివాస దరఖాస్తు ఫీజు 3,029 నుంచి 3,226 పౌండ్‌లకు యూకే ప్రభుత్వం పెంచింది. విదేశీ వర్కర్‌లను నియమించుకునే కంపెనీల స్పాన్సర్ లైసెన్స్ వీసా ఫీజులు కూడా పెరిగాయి. పెద్ద సంస్థలకు స్పాన్సర్ లైసెన్స్ ఫీజును 1,579 పౌండ్ల నుంచి 1,682 పౌండ్‌లకు ప్రభుత్వం పెంచింది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఫీజు 16 పౌండ్ల నుంచి 20 పౌండ్‌లకు పెరిగింది. గతేడాది కూడా బ్రిటన్ పలు రకాల వీసా ఫీజులను పెంచిన విషయం తెలిసిందే.


ఈ వార్త చదవండి:
ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు! చైనా నిర్ణయంతో ప్రకంపనలు

యుద్ధ ట్యాంకుపై ఉత్తర కొరియా అధ్యక్షుడు! టీనేజ్ కూతురితో పాటూ..

Updated Date - Mar 20 , 2026 | 02:59 PM