వైసీపీ పాలనలో 30 వేల మంది చనిపోయారు: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:41 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణలో పలు సంస్కరణలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని, భారీ స్కామ్ కూడా జరిగిందని ఆరోపించారు.
గుంటూరు జిల్లా: రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణ, నాణ్యత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో నాసిరకం మద్యం సేవించి అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని, దాదాపు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
జగన్ రెడ్డి పాలనలో సరైన బ్రాండ్లు అందుబాటులో లేక ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుని తాగాల్సి వచ్చిందని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద మద్యం స్కామ్ వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని, దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరు ప్రాంతాల్లో అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం నాణ్యతను పరీక్షించి, ప్రజలకు హానికరంగా ఉన్న బ్రాండ్లను పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. ప్రజలు విచ్చలవిడిగా మద్యం సేవించకుండా ఉండేందుకు వైన్ షాపుల్లో ప్రత్యేక గదుల (రూమ్) అనుమతులు కూడా ఇచ్చామని మంత్రి వివరించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా మద్యం విధానంలో మరిన్ని మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
Read Latest AP News