పరిశ్రమలు రాకుండా చేయడానికే జగన్ ఇలా చేస్తున్నాడు: మంత్రి జనార్ధన్ రెడ్డి
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:07 PM
రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. లూలు వంటి ప్రముఖ కంపెనీలు కూడా జగన్ దెబ్బకు భయపడి రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు.
అమరావతి: వైఎస్ జగన్‌పై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో జువ్వలదిన్నె వద్దకు వెళ్లి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేస్తాడా? అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన వారిని లేపేస్తాం, పంపేస్తా, చంపేస్తా' అంటూ జగన్ బెదిరింపులకు దిగుతున్నారని మంత్రి ఆరోపించారు. లూలు వంటి పెద్ద కంపెనీలు కూడా జగన్ దెబ్బకు భయపడి వెనక్కి వెళ్లిపోయాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. జువ్వలదిన్నె ప్రాజెక్టును తన పాలనలో ఎందుకు అమలు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని, అయినప్పటికీ ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం పెట్టి జగన్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజావేదికను కూల్చివేశాడని, పూర్తి కాకముందే ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేయడం గత ప్రభుత్వ అలవాటని విమర్శించారు. సరైన ప్రణాళిక లేకుండా డీపీఆర్‌లు తయారు చేసి పంపించారని, దీంతో అనేక ల్యాండ్ ఇష్యూలు తలెత్తాయని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వాటిని పరిష్కరించి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. తన హయాంలో జువ్వలదిన్నె ప్రాజెక్టు పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
పీపీపీ మోడల్‌లో విద్యాసంస్థలపై వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, జగన్ చెప్పిన లెక్కలు తప్పని ప్రజల ముందు నిరూపిస్తామని అన్నారు. మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ వారి హక్కులను గౌరవిస్తామని, అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తెలిపారు. తమిళనాడు నుంచి వచ్చిన మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లతో వచ్చి ఇబ్బందులు సృష్టించారని, ఆ బోట్ల స్వాధీనంపై కూడా వివాదాలు ఉన్నాయని పేర్కొన్నారు. కళ్లు మూసుకుంటేనే మూడేళ్లు అయిపోతాయని చెప్పే జగన్, అయిదేళ్లు కళ్లు మూసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశాడని మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కళ్లు మూసుకుంటే రాజకీయంగా జగన్ కనిపించకుండా పోతాడంటూ బీసీ జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర
టీడీపీలో ఎన్నో సంస్కరణలకు లోకేశ్ శ్రీకారం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
Read Latest AP News