బీసీలు చట్టసభల్లో ఉన్నపుడే వారికి న్యాయం జరుగుతుంది: శ్రీనివాస్ గౌడ్
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:00 PM
తెలంగాణలో నిర్వహించిన కుల గణన గణాంకాలు పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీల అసలు జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపిస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీ, ఏప్రిల్ 16: తెలంగాణలో నిర్వహించిన కుల గణన గణాంకాలు పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీల అసలు జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 61 శాతం వరకు ఉన్న బీసీ జనాభాను తక్కువగా చూపిస్తూ వాస్తవాలను వక్రీకరించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ను ఇప్పటివరకు అమలు చేయలేదని, కులాల వారీగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.
బీసీలకు తగిన రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా కేవలం పదవులు ఇస్తున్నామంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీ కుటుంబాల వివరాలు సరిగ్గా సేకరించలేదనే కారణంతోనే తెలంగాణలో కుల గణన వివరాలు బయటపెట్టారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని స్పష్టం చేశారు.
బీసీలకు న్యాయం జరగాలంటే ముందుగా కామారెడ్డి డిక్లరేషన్‌ను పూర్తిగా అమలు చేయాల్సిందేనని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, బీసీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం పొందినప్పుడే వారికి న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 56 శాతం పైగా ఉన్న బీసీ జనాభాకు తగిన రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి...
రేవంత్ ట్రాప్‌లో సౌత్ ప్రజలు పడరు: రాంచందర్ రావు
పెట్టుబడులు పెట్టండి.. అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం