గుంటూరులో బాలిక మిస్సింగ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 08:13 PM
గుంటూరు పట్టాభిపురంలో జూన్ 10న అదృశ్యమైన పదో తరగతి బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
గుంటూరు, సెప్టెంబర్ 05: జిల్లాలో సంచలనం సృష్టించిన పదో తరగతి బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 10న నమోదైన ఈ కేసుకు సంబంధించి వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. 'బాధితురాలు బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి.. షేక్ జాన్ సైదాతో కలిసి పారిపోయినట్లు విచారణలో తేలింది. గుంటూరు నుంచి నెల్లూరు, కోయంబత్తూరు, పాలక్కాడ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వీరు ప్రయాణించారు. నిందితుడు ఎప్పటికప్పుడు సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకుని తిరిగాడు. అయినప్పటికీ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించారు' అని ఎస్పీ తెలిపారు.
'బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా వారిని పట్టుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించాయి. చివరకు నిందితుడి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన ఒక మిస్డ్ కాల్‌ను ఆధారంగా చేసుకుని పోలీసులు వారు ఉండే ప్రాంతాన్ని కనుగొన్నారు. హరియాణాలోని కర్నాల్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు' అని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.
'ఈ కేసులో నిందితుడిపై కిడ్నాప్, పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశాము. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఉంది. ఈ విషయం ఇరు కుటుంబాలకూ తెలుసు. ముఖ్యంగా నిందితుడి తల్లి, సోదరి ఈ వ్యవహారాన్ని ప్రోత్సహించినట్లు తేలడంతో వారిని కూడా నిందితులుగా చేర్చారు. మొదటి నుంచి పక్కాగా దర్యాప్తు చేయడం వల్లే నిందితులను త్వరగా పట్టుకోగలిగాము' అని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు
టీచర్స్ డే.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సచిన్!