Share News

కాసేపట్లో భేటీ కానున్న సీఎం చంద్రబాబు, సీఎం విజయ్.. ఈ అంశాలపై చర్చించే అవకాశం..!

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:49 PM

విజయవాడ పర్యటనలో భాగంగా తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. అందుకోసం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి సీఎం విజయ్ చేరుకోనున్నారు.

కాసేపట్లో భేటీ కానున్న సీఎం చంద్రబాబు, సీఎం విజయ్.. ఈ అంశాలపై చర్చించే అవకాశం..!

అమరావతి, అక్టోబర్ 13: విజయవాడ పర్యటనలో భాగంగా తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. అందుకోసం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి సీఎం విజయ్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు సీఎంల మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడుకు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందిస్తున్న అంశంపై వీరు చర్చించనున్నారు. అలాగే చెన్నై తాగు నీటి అవసరాలకు తెలుగు గంగ ద్వారా ఈ ఏడాది 4.08 టీఎంసీల నీటిని ఏపీ ఇచ్చిన విషయం విదితమే.


అయితే తెలుగు గంగ నుంచి నీటి విడుదలను పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరుతుంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. మానవీయ కోణంలో తమిళనాడుకు తాగు నీటి అవసరాలకు నీరు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత తదితర అంశాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ఈ నీటిని విడుదల చేస్తోంది.


అలాగే పోలవరం - కావేరి అనుసంధానంపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. దక్షిణాదిలో నదుల అనుసంధానంపై పొరుగు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. గోదావరి - కావేరి నదుల అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల సమన్వయంతో, కేంద్ర సహకారంతో ఈ భారీ ప్రాజెక్టును సాకారం చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనల నేపథ్యంలో తమిళనాడు నుంచి చొరవ తీసుకుని చర్చలకు సీఎం విజయ్ మంగళవారం విజయవాడ చేరుకున్నారు. తద్వారా గోదావరి - కావేరి అనుసంధానంతో వృధాగా పోతున్న వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే ఆలోచనలకు ముందడుగు పడనుంది. మరో వైపు గోదావరి - కావేరి అనుసంధానంలో భాగంగా గోదావరి - బనకచర్లను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది.


గోదావరి నుంచి కృష్ణకు.. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు గోదావరి నీటిని తరలించేలా ప్రతిపాదన చేస్తోంది. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు, అక్కడి నుంచి పెన్నాకు నీటిని తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కండలేరు ద్వారా కావేరి నదికి నీటిని తీసుకెళ్లేలా గోదావరి - కావేరి అనుసంధాన ప్రతిపాదన చేయనున్నారు. పొరుగు రాష్ట్రాల భాగస్వామ్యం, కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు సాకారం చేయాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.


విజయవాడ చేరుకున్న సీఎం విజయ్..

ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం విజయ్ చేరుకున్నారు. ఈ సంద్బంగా ఆయనకు మంత్రి నారాయణతోపాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి సీఎం విజయ్ చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి..

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 05:21 PM