Share News

ఆ రోజు నా మీద చెయ్యి చేసుకున్నారు: శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్

ABN , Publish Date - Apr 02 , 2026 | 09:00 PM

మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు.

ఆ రోజు నా మీద చెయ్యి చేసుకున్నారు: శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్
Former LC Chairman MA Shariff

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అన్ని జిల్లాల వ్యాప్తంగా చిన్నాపెద్ద అనే తేడా లేకుండా కేక్ కట్ చేసి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. కెమెరాలు కట్ చేసి చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తొలిసారి పెదవి విప్పారు.


ఈ సందర్భంగా ఎం.ఎ.షరీఫ్ మాట్లాడుతూ..'ఆరోజు సభలో ఓ మంత్రి నా మీద చెయ్యి చేసుకున్నారు. మరో మంత్రి ఏకవచనంతో నన్ను తిట్టిపోశారు. కులం పేరుతో దూషిస్తూ నా పుట్టుకను నిందించారు. శాసనమండలిలో నా సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారు. వైసీపీ సభ్యులంతా నా మీదకు వచ్చేశారు. కుర్చీలు, బెంచీలు ఎక్కి టేబుల్ మీద కూర్చొన్నారు. నా చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారు. మండలినే రద్దు చేస్తామని బెదిరించారు.


నాకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదు. నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించుకుని 'అల్లా సత్యం వైపు ఉండేటట్లుగా నా కళ్లు తెరువు' అని కోరా. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా.. బెదిరించినా ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు ఆరోజు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాతా నన్ను చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టం చేయడం ఆనందంగా ఉంది' అని నాడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

పేర్ని నాని, కిట్టుకి పోలీసు అధికారుల సంఘం వార్నింగ్

రోడ్డుపై నిమ్మకాయలు, టెంకాయ.. ఈ పోలీస్ ఏం చేశారో మీరే చూడండి..

Updated Date - Apr 02 , 2026 | 09:14 PM