రాజధానిగా అమరావతి.. ఏపీలో అంబరాన్నంటిన సంబరాలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:24 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 2, 2026 ఒక చరిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది. గత పదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి పార్లమెంట్ తుది తీర్పునిచ్చింది.
అమరావతి, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 2, 2026 ఒక చరిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది. గత పదేళ్ళుగా రాజధాని విషయంలో నెలకున్న అనిశ్చితికి పార్లమెంట్ తుది తీర్పునిచ్చింది. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలపగా, గురువారం రాజ్యసభ సైతం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఈ పరిణామంతో ఆంధ్రుల చిరకాల స్వప్నం సాకారమైంది. ఇది రైతుల త్యాగానికి, మహిళల ఉద్యమానికి దక్కిన విజయం అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిందన్న వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అమరావతి రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు రోడ్ల పైకి వచ్చి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. బాపట్ల జిల్లా వేమూరులో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు నక్కా ఆనంద బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, కేక్ కట్ చేసి జాతీయ జెండా చేతపట్టి కూటమి నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేటితో అమరావతికి పట్టిన గ్రహణం వీడిపోయింది. అమరావతికి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత వచ్చింది. అందరి సహకారంతో అమరావతి అద్భుత రాజధాని కాబోతుంది’ అని అన్నారు. దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ సీతంరాజు సుధాకర్, టీడీపీ నేతలు, కార్యకర్తలు.. జగదాంబ జంక్షన్ వద్ద కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఇకపై అమరావతిని ఎవరూ అంగుళం కూడా కదిలించలేరు..
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. ‘ఉభయ సభల్లో బిల్లు పాస్ కావడమే కాకుండా, రాష్ట్రపతి సంతకంతో గెజిట్ విడుదలయ్యాక అమరావతి ఉనికిని ఎవరూ ప్రశ్నించలేరు. రాజ్యంగం, చట్టం పట్ల అవగాహన లేని వాళ్లు మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారు. ఆనాడు శాసనమండలిలో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిన శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయమే నేటి ఆనందానికి మూలం’ అని అన్నారు.
ప్రపంచం గర్వించే విధంగా అమరావతి రూపు దిద్దుకోబోతోంది..
మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ ఆనాడు ఢిల్లీ వేదికగా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎలా చాటారో, నేడు చంద్రబాబు అమరావతి ద్వారా ఆంధ్రుల భవిష్యత్తు తరాలకు గర్వకారణంగా నిలిచారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడింది. అమరావతి కోసం పోరాడిన మహిళా రైతులకు, భూములిచ్చిన రైతులకు దేవుడు ఈ రూపంలో న్యాయం చేశారు. సీఎం చంద్రబాబు కల నెరవేరింది.’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు
రాజధానికి పట్టిన గ్రహణం వీడింది: మంత్రి లోకేశ్
For More AP News And Telugu News