Share News

44,89,512 ఓట్లు అవుట్!

ABN , Publish Date - Aug 01 , 2026 | 07:32 AM

రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ (సర్‌)-2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది.

44,89,512  ఓట్లు అవుట్!
AP Voter List

  • రాష్ట్రంలో తాజా ఓటర్ల సంఖ్య 3,71,38,182

  • ‘సర్‌’ ప్రక్రియ తర్వాత ముసాయిదా జాబితా విడుదల

  • థర్డ్‌ జెండర్‌ 2736.. సర్వీసు ఓటర్లు 64,502

  • అత్యధిక ఓటర్లలో కర్నూలు టాప్‌

  • పోలవరం జిల్లాలో అత్యల్పం

  • సర్‌కు ముందు మొత్తం ఓటర్లు 4,16,27,694

  • ఎన్యుమరేషన్స్‌ తిరిగిచ్చింది 3.71 కోట్ల మందే

  • అన్‌కలెక్టబుల్‌ ఫారాలు 44.89 లక్షలు

  • వీరిలో మృతులు 15.22 లక్షలు

  • శాశ్వత వలసలు, గైర్హాజరు 22.30 లక్షలు

  • డూప్లికేట్‌ ఓటర్లు 7.37 లక్షలు

  • ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ

  • సెప్టెంబరు 28నాటికి వాటి పరిష్కారం

  • అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా విడుదల

  • నోటీసు ఇవ్వకుండా ఒక్క పేరూ తొలగించం

  • సీఈవో వివేక్‌ యాదవ్‌ స్పష్టీకరణ

  • మహిళలు 1,89,28,492

  • పురుషులు 1,82,06,954

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ (సర్‌)-2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది. సర్‌ ప్రక్రియకు ముందు (ప్రి-సర్‌) మొత్తం ఓటర్లు 4,16,27,694 కోట్ల మంది కాగా.. ఈ ప్రక్రియ తర్వాత 44,89,512 మంది తగ్గారు. ముసాయిదా జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య (1,89,28,492) పురుషుల (1,82,06,954) కంటే అధికంగా ఉంది. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 2736 మంది. సర్వీసు ఓటర్లు 64,502 మంది ఉన్నారు. సర్‌కు ముందు కూడా మహిళా ఓటర్ల సంఖ్యే (2,12,27,527) ఎక్కువ. అప్పుడు పురుష ఓటర్లు 2,03,96,737 మంది ఉండేవారు. సర్‌కు ముందున్న 4,16,27,694 మంది ఓటర్లందరికీ ఈసీ ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసింది. అందులో 3.71 కోట్ల మంది (89.22 శాతం) ఆ ఫారాలను తిరిగి ఇవ్వడంతో వారి పేర్లను డిజిటలైజ్‌ చేసింది. మిగిలిన 44,89,512 ఫారాలు (10.78 శాతం) అన్‌కలెక్టబుల్‌ జాబితాలో ఉన్నాయి. 15.22 లక్షల మంది చనిపోయినట్లు గుర్తించారు. శాశ్వతంగా వలస వెళ్లిపోయినవారు, గైర్హాజరైనవారి కేటగిరీలో 22.30 లక్షల మంది ఉన్నారు. రెండు కన్నా ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారు 7.37 లక్షల మంది.


కర్నూలు, అనంత, విశాఖ టాప్‌..

ముసాయిదా జాబితా ప్రకారం.. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు ఉన్న జిల్లాల్లో మొదటి స్థానంలో కర్నూలు (18,12,532).. ద్వితీయ స్థానంలో అనంతపురం (17,90,436).. తృతీయ స్థానంలో విశాఖపట్నం జిల్లా (17,82,800) నిలిచాయి. అత్యల్పంగా ఓటర్లు (2,39,591) ఉన్న జిల్లాగా పోలవరం చివరి స్థానంలో నిలిచింది. దానికి ముందు స్థానాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా (4,36,494), పార్వతీపురం మన్యం జిల్లా (7,15,443) ఉన్నాయి. రాష్ట్రంలో 27 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఒక్క మార్కాపురం జిల్లాలో మాత్రమే పురుష ఓటర్లు 8519 మంది అధికంగా ఉన్నారు.


తొలగింపుల్లో అగ్ర భాగాన నెల్లూరు, తిరుపతి, కర్నూలు..

నెల్లూరు జిల్లాలో సర్‌కు ముందు 19,74,240 మంది ఓటర్లు ఉండగా.. తాజా ముసాయిదాలో 16,83,557 మంది ఉన్నారు. మృతులు, అందుబాటులో లేనివారు, శాశ్వతంగా వలసపోయినవారు, డూప్లికేట్‌ ఓటర్లుగా పేర్కొంటూ ఈసీ 2,90,683 మందిని తొలగించింది. రెండో స్థానంలో తిరుపతి జిల్లా (2,87,837), మూడో స్థానంలో కర్నూలు జిల్లా (2,73,587).. ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం (2,48,087), కడప (2,44,919), విశాఖ 2,40,209) ఉన్నాయి. తక్కువ ఓట్ల తొలగింపు జరిగిన జిల్లాల జాబితాలో పోలవరం (38,927), అల్లూరి (63,258), పార్వతీపురం మన్యం (75,119) ఉన్నాయి.


ఓట్ల తొలగింపులో తిరుపతి నియోజకవర్గం టాప్‌..

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపుల్లో తిరుపతి (90,882) మొదటి స్థానంలో నిలువగా.. కర్నూలు (67,755), కడప (66,558), గుంటూరు పశ్చిమ (59,334), నెల్లూరు రూరల్‌ (57,948), గాజువాక (56,468), అనంతపురం అర్బన్‌ (53,790) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నరసాపురం నియోజకవర్గంలో 7330, పెడన నియోజకవర్గంలో 9,288 ఓట్లు తొలగించారు.

రాష్ట్రంలో 2002 నాటి సర్‌ ఓటర్ల జాబితాతో సరిపోలని ఓటర్‌ ఎన్యుమరేషన్‌ ఫారాలు 7,56,398 ఉన్నాయి. వీరికి నోటీసులిస్తారు. వీరు తమ సరైన వివరాలను సమర్పించాలి. లేదా ఈసీ నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి సరిచేయించుకోవాలి.

డిజిటలైజేషన్‌ అయిన 36,38,979 ఓటర్ల ఎన్యుమరేషన్‌ ఫారాల్లో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. 2002 నాటి సర్‌ ఓటరు జాబితా వివరాలతో సరిపోల్చినప్పుడు ఇంటి పేరు, ఓటరు పేరు, వయసు, ఇతర వివరాల్లో స్పల్ప తప్పులు గుర్తించారు. ముసాయిదా జాబితాలో వీరి పేర్లు ఉన్నప్పటికీ ఈసీ నోటీసులు జారీ చేస్తుంది. వారిచ్చిన వివరాలను మళ్లీ వెరిఫై చేసి వివరాలను సరిచేస్తుంది.


Updated Date - Aug 01 , 2026 | 08:16 AM