రాష్ట్రంలో ఫార్మ్ టూ హోమ్ విధానం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 26 , 2026 | 07:24 PM
ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు 'ఫార్మ్ టు హోమ్' విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు.
అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్ధక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో 'ఫార్మ్ టూ హోమ్' విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరేలా కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటూ మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు సమీపంలో 'కోకో సిటీ' ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు జులైలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
కడప జిల్లా పులివెందులలో నిర్మాణంలో ఉన్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆక్వా రంగానికి ప్రోత్సాహంగా కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. రైతులు, మత్స్యకారులు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ