Share News

మా ప్రతి పైసా కష్టపడి సంపాదించినదే: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

ABN , Publish Date - May 26 , 2026 | 05:41 PM

ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి స్పందించారు. ఈడీ అడిగిన అన్ని ఆస్తుల వివరాలనూ సమర్పించామని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు.

మా ప్రతి పైసా కష్టపడి సంపాదించినదే: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
Mohith Reddy On ED investigation

అమరావతి: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ అనంతరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి స్పందించారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ఆస్తుల వివరాలనూ అందజేశామని తెలిపారు. విచారణకు తమవంతుగా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు తాము సంపాదించిన ఆస్తుల వివరాలన్నింటినీ ఈడీకి సమర్పించామని మోహిత్ రెడ్డి వెల్లడించారు. తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయీ కష్టార్జితమే తప్ప అక్రమంగా సంపాదించలేదని స్పష్టం చేశారు.


ఏపీ సిట్ కక్షపూరితంగా తమపై కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. అయితే ఆ కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పారు. ముడుపుల సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశారంటూ ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, వాటిలో నిజం లేదన్నారు. తాము సంపాదించిన ప్రతి పైసా కష్టపడి సంపాదించిన డబ్బేనని పేర్కొన్న మోహిత్ రెడ్డి.. ఈ కేసులపై న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.

కాగా, రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈడీ.. విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భార్యతో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నేడు (మంగళవారం) ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Updated Date - May 26 , 2026 | 05:55 PM