టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్.. కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవి..
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:03 PM
కార్యకర్తలే దేవుళ్లని.. వారిని పట్టించుకోని నేతలు తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. టీడీపీ శ్రేణులంతా క్రమశిక్షణతో పని చేయాలని.. పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కష్టపడిన వారిని గుర్తించే పని మంత్రి నారా లోకేశ్ చూసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు, నేతలకు గుడ్ న్యూస్ చెప్పారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేస్తూ తీపి కబురు చెప్పారు. డీలిమిటేషన్ కారణంగా ఏపీ అసెంబ్లీ సీట్లు 50 వరకూ పెరిగే అవకాశం ఉందని.. టీడీపీ కోసం ఎవరు బాగా పని చేస్తే వారే ప్రజాప్రతినిధులంటూ స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. కార్యకర్తలే దేవుళ్లని.. వారిని పట్టించుకోని నేతలు తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు సీఎం. టీడీపీ శ్రేణులంతా క్రమశిక్షణతో పని చేయాలని.. పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కష్టపడిన వారిని గుర్తించే పని మంత్రి నారా లోకేశ్ చూసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా ఉండాలని.. వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలోనూ తెలుగుదేశం బ్రాండ్ నిలిపేలా వ్యవహరించాలని సూచించారు. అభివృద్ధి అనేది వైకుఠంపాళి కాకూడదన్నారు. అందుకు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే.. రాష్ట్రం బలంగా ఉంటుందని అన్నారు.
పార్టీ గెలుపే రాష్ట్రం గెలుపంటూ ఉద్ఘాటించారు. పసుపు జెండా నిరంతరం ఎగరాలని.. ఏపీ ఎప్పుడూ గెలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమానికి నాంది పలికింది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. మైనారిటీల కోసం కార్పొరేషన్ తీసుకొచ్చామని.. వారి జీవన ప్రమాణాలు పెంచామని చెప్పారు చంద్రబాబు. పార్టీ బలోపేతం కోసం పని చేస్తానంటూ కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. చివరిలో 'జై తెలుగుదేశం.. పార్టీ కార్యకర్తలకు జై' అంటూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం తన నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదల్లేదు: లోకేశ్
దద్దరిల్లిన సుక్మా అడవులు.. ఓ మావోయిస్టు మృతి..!