గొడ్డలి పార్టీ నిరసనల్లో ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థి ఉన్నారా?: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:57 PM
ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా చేసే నిరసనలను ఏమాత్రం ఉపేక్షించబోమని వైసీపీ నేతలను ఆయన హెచ్చరించారు.
అమరావతి, ఆగస్టు 08: ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా చేసే నిరసనలను ఏమాత్రం ఉపేక్షించబోమని వైసీపీ నేతలను ఆయన హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించబోమన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్‌లు, రహదారుల వెంట నిరసనలు అంటే ప్రభుత్వం ఊరుకోదని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు.
గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయ్ బ్యాచ్ తప్ప ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థి ఉంటున్నారా? అని సీఎం ప్రశ్నించారు. కర్నూలు నగరంలో ఈ రోజు (శనివారం) కదం తొక్కిన వారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులేనని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గొడ్డలి పార్టీ చేసే నష్టం వల్ల.. ఐక్యంగా తమ ఆత్మగౌరవాన్ని డీఎస్సీకి ఎంపికైన ఉపాధ్యాయులంతా చాటారని చెప్పారు.
ఈ ఆగస్టు నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు వివరించారు. వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకూ ఈ నెలలోనే సాకారమవుతాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వచ్చే ఏడాది విశాఖ వరకూ తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే ఈ నెలలోనే అమరావతికి సంబంధించి రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభవుతాయని సీఎం చంద్రబాబు వివరించారు. సీడ్ యాక్సిస్ రహదారి ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వర్షాకాలంలోనూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల రెండు రోజుల్లో శ్రీశైలం జలశయం నిండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆ తర్వాత నాగార్జున సాగర్‌కూ నీరు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. ఆర్ధిక వ్యవహారాలపై విడుదల చేసిన శ్వేత పత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని అన్నారు. ఈ ప్రజెంటేషన్ కోసం 10 గంటలు అధ్యయనం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇకపై ప్రతీ ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఆర్ధిక పరిస్థితిని వివరిస్తేనే ప్రజలు అర్ధం చేసుకుంటారని సీఎం చంద్రబాబు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి సోనోవిజన్ షాపులో రూ.2 కోట్ల విలువైన ఫోన్ల చోరీ
కోర్టులు మొట్టికాయలు వేసినా.. వైసీపీ నేతల తీరు మారడం లేదు: మంత్రి నారాయణ
For More AP News And Telugu News