స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 26 , 2026 | 09:21 AM
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ అగ్రనేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో లభించిన అద్భుత విజయం తర్వాత.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నామని అన్నారు.
అమరావతి, అక్టోబర్ 26: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ అగ్రనేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో లభించిన అద్భుత విజయం తర్వాత.. ఇచ్చిన హామీలను నెరవెేరుస్తూ వస్తున్నామని అన్నారు. అందుకే ‘చెప్పాం-చేస్తున్నాం’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. సోమవారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు.
మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేనని.. అందులో ఎలాంటి వెసులుబాటూ లేదని ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. 2024 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రచారానికి ప్రజల వద్దకు వెళ్తున్నామని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రం, స్థానికంగా.. ఇలా మూడు స్థాయిల్లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని సోదాహరణతో వివరించారు. అగ్రనేతలు మొదలుకుని.. కార్యకర్త వరకు చేసే పనిని రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. పొత్తులు, రిజర్వేషన్ల కారణంతోపాటు సోషల్ రీ-ఇంజనీరింగ్‌లో భాగంగా కొంత మందికి అవకాశాలు దక్కలేదని వివరించారు. రాష్ట్రం, పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపునిస్తామని.. వారిని నామినేటెడ్ పదవులతో గౌరవిస్తామని చెప్పారు.
కూటమి అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ.. ప్రతి ప్రాంతానికీ లబ్ది చేకూర్చేలా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రికార్డులు సృష్టించేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని వారికి వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేశామని.. చిన్న కులాలకు కూడా ప్రాధాన్యతనిచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. పాలనలో తామూ భాగస్వాములమనే సంతృప్తి ప్రతి ఒక్క వర్గానికి కలగాలని అన్నారు. ప్రభుత్వానికి.. ప్రజలకు కూటమి పార్టీల కార్యకర్తలే వారధిగా నిలవాలని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు చక్కటి సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పని చేయాలని ఆదేశించారు.
వార్డూ.. డివిజన్ మొదలుకుని ప్రతి స్థానంలోనూ కూటమి పార్టీల జెండాలు ఎగరాల్సిందేనని ఈ సందర్భంగా అగ్రనేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీలకు పాజిటివ్ ఓట్లు పడాలి.. అదే విధంగా కూటమికి పాజిటివ్ ఓటు బ్యాంకు మరింత పటిష్టం కావాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసేలా చూడాలని అగ్రనేతలను ఆదేశించారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ 2024 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు పడాలని వారికి వివరించారు.
ప్రభుత్వం చేసే మంచిని వివరించడంతోపాటు.. గొడ్డలి పార్టీ చేసే అరాచకాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉందని నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతాడని.. అలాగే కుటుంబ బంధాలనూ కూడా పట్టించుకోడని మండిపడ్డారు. 151 సీట్లతో గెలుపొంది అరాచకాలు చేసిన గొడ్డలి పార్టీకి కేవలం 11 సీట్లే ఇచ్చి నాడు ప్రజలు తిరుగుబాటు చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నేతలపై దాడులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
వాటర్ బోర్డు డైరెక్టర్ కారులో 2.40 లక్షల నగదు
For More AP News And Telugu News