Share News

వైసీపీ హయాంలో.. గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అక్రమాలు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 19 , 2026 | 03:48 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని ఆయన వ్యాఖ్యానించారు.

వైసీపీ హయాంలో.. గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అక్రమాలు: సీఎం చంద్రబాబు
Chandrababu On APPSC Group 1 Scam

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC) గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చే అధికారులను గ్రూప్-1 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారని, ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తారని చెప్పారు. అలాంటి పరీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు.


ప్రజలు, ఉద్యోగార్థులు ఈ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ జవాబుదారీతనానికి వేదిక అని, ఇక్కడి నుంచే ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని తాను చాలాసార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం పోయేలా గత పాలకులు వ్యవహరించారని విమర్శించారు.


2018లో గ్రూప్‌-1 సర్వీసులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా 1.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. వారిలో 325 మందిని షార్ట్‌లిస్ట్‌ చేశారని చెప్పారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్ట్‌తో తరలిస్తామని, అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారులను ఎంపిక చేసే పరీక్షల విషయంలో మరింత భద్రత ఉండాలని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపించారు.


గ్రూప్‌-1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో డిజిటల్‌ విధానాన్ని పక్కనపెట్టి మాన్యువల్‌ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. అయినప్పటికీ కోర్టును తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేసి వ్యవహరించారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత పరిస్థితిని సరిదిద్దుకోవాల్సి ఉండగా, హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం కోసం రూ.1.19 కోట్ల పనులకు ఉత్తర్వులు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు కూడా చేశారన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిబంధనలను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులకు మూల్యాంకన బాధ్యతలు అప్పగించారని సీఎం విమర్శించారు. గ్రూప్‌-1 అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో మూల్యాంకనం చేయించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.


Also Read:

సీఎం చంద్రబాబు అన్ని సౌకర్యాలు కల్పించారు: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు

ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు: నారాయణ

Updated Date - Aug 19 , 2026 | 04:01 PM