Sankranti Bus Charges: ప్రైవేటు ట్రావెల్స్‌పై ఉక్కుపాదం.. అధిక చార్జీలు వసూలు చేస్తే..
ABN , Publish Date - Jan 10 , 2026 | 09:10 AM
సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు దోపిడీకి తెరలేపాయి. టికెట్ ధరలు సాధారణ రోజుల్లో నామమాత్రంగా ఉంటే.. పండుగ సీజన్‌లో మాత్రం మూడింతలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
అమరావతి, జనవరి10(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఏపీలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు చార్జీలను మూడు రెట్లు పెంచేశాయి. విమాన ప్రయాణ చార్జీలకు దీటుగా బస్సు టికెట్ల ధరలను పెంచేయడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రంగంలోకి దిగింది. అధిక దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలపై ఆర్టీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
కఠిన చర్యలు..
ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలను అరికట్టేందుకు ఏపీ రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, టోల్ ప్లాజాల వద్ద ప్రైవేటు బస్సులను తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందాలను (Special Squads) నియమించారు.
బస్సుల సీజ్..
నిబంధనలు ఉల్లంఘించి అదనపు చార్జీలు వసూలు చేసినా, పర్మిట్లు లేకుండా బస్సులు నడిపినా వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. పదేపదే నిబంధనలు అతిక్రమించే ట్రావెల్స్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ఫిర్యాదు చేయండి..
అధిక చార్జీల వల్ల ఇబ్బంది పడే ప్రయాణికులు నేరుగా ఫిర్యాదు చేయాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. ఇందుకోసం 9281607001 నంబర్‌కు ఫోన్ చేసి గానీ లేదా వాట్సప్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
ప్రత్యేక తనిఖీ బృందాల ఏర్పాటు..
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ బృందాలు బస్టాండ్లు, ప్రధాన రహదారుల్లోని స్టాపింగ్ పాయింట్స్ వద్ద తనిఖీలు చేపడతాయని వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు, అనుమతుల రద్దు వంటి చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
ఆర్టీసీ బస్సులు: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోందని అధికారులు వెల్లడించారు. వాటిలో చార్జీలు నియంత్రణలో ఉంటాయని వివరించారు. ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రయాణికులకు సూచనలు..
ప్రయాణికులకు రవాణాశాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా టికెట్ లేదా డిజిటల్ రసీదును దగ్గర ఉంచుకోవాలని సూచించారు. అదనపు ధర వసూలు చేస్తే అధికారులకు ఈ రసీదును చూపించాలని తెలిపారు. రసీదు ఆధారంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చివరి నిమిషంలో కాకుండా సాధ్యమైనంత వరకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. టికెట్ తీసుకునే ముందు చార్జీలను తెలుసుకోవాలని తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. బిల్ లేదా టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News