స్థానిక ఎన్నికలపై కసరత్తు
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:27 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో భేటీ కానున్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించేలా దిశానిర్దేశం చేయనున్నారు.
పీఆర్, మున్సిపల్ అధికారులతో 6న ఎన్నికల కమిషనర్ భేటీ
అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో భేటీ కానున్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కమిషన్‌కు అవసరమైన బీసీ జనాభా వివరాలను పంచాయతీరాజ్‌శాఖ అందించింది. ముందు మున్సిపల్, ఆ తర్వాత పరిషత్, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో మున్సిపల్ వార్డుల విభజన, కోర్టులో కేసు కారణంగా స్టే ఉన్న మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్చించనున్నారు. స్థానికసంస్థల ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేయనున్నారు.