ఏపీలో పంటల బీమా దరఖాస్తులు 2.3 రెట్లు పెరిగాయి.. రైతులకు అచ్చెన్నాయుడు కీలక సూచన
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:18 PM
పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీపై వాస్తవాలను విస్మరించి రైతులను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధిష్టానం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అమరావతి, నవంబర్26: పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీపై వాస్తవాలను విస్మరించి రైతులను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధిష్టానం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గురువారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్-2025తో పోలిస్తే ఖరీఫ్-2026లో పంటల బీమా నమోదు రెట్టింపు పైగా పెరిగిందని.. ఇది కూటమి ప్రభుత్వ చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్-2026లో సాగైన 31.01 లక్షల హెక్టార్లలో 17.07 లక్షల హెక్టార్లు (55.05 శాతం) బీమా పరిధిలోకి వచ్చాయని వివరించారు. పంటల బీమా చేసిన విస్తీర్ణ పరంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
ఖరీఫ్-2025లో 18.88 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఖరీఫ్-2026లో 44.09 లక్షలకు పెరిగి 2.3 రెట్ల వృద్ధి నమోదైందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రుణం పొందని రైతుల దరఖాస్తులు 2 లక్షల నుంచి 25.27 లక్షలకు పెరిగి 12.6 రెట్ల వృద్ధి సాధించాయని తెలిపారు. బీమా విస్తీర్ణం 7.67 లక్షల నుంచి 17.07 లక్షల హెక్టార్లకు, బీమాలో చేరిన రైతుల సంఖ్య 7.43 లక్షల నుంచి 17.10 లక్షలకు పెరిగిందని చెప్పారు. 2026 జూలై 29-31 వరకు నిర్వహించిన ఇంటింటి ప్రచారం, రైతు సేవా కేంద్రాల పర్యవేక్షణ ఇందుకు దోహదపడ్డాయని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పంటల బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం వల్లే రైతులకు పరిహారం అందడంలో ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను విడతలవారీగా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రూ.3,000 కోట్ల కార్యాచరణ రూపొందించామని స్పష్టం చేశారు. 2026-27లో రూ.500 కోట్లు, 2027-28లో రూ.1,000 కోట్లు, 2028-29లో రూ.1,500 కోట్లు చెల్లించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపిందని తెలిపారు. రాష్ట్ర వాటా అందిన వెంటనే పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలని బీమా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు.
గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని వైసీపీ నేతలకు మంత్రి అచ్చెన్నాయుడు హితవు పలికారు. ముందు తన హయాంలోని బకాయిలను గుర్తుంచుకోవాలని వైఎస్ జగన్‌కు స్పష్టం చేశారు. రబీ 2024-25 నుంచి రైతులను భాగస్వాములను చేస్తూ స్వచ్ఛంద నమోదు విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల ప్రీమియం వాటా పోగా మిగిలిన సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరిస్తున్నాయని వివరించారు. రబీ 2022-23 పెండింగ్ ప్రీమియం కోసం రూ.500 కోట్లు విడుదల చేయగా, ఇప్పటికే రూ.250 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించామని గుర్తు చేశారు.
ఖరీఫ్-2026 నుంచి ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో రూ.250 కోట్లు జమ చేసి, ఖరీఫ్-2026కు రూ.83 కోట్లు, రబీ 2026-27కు రూ.44 కోట్లు అడ్వాన్స్ ప్రీమియం చెల్లించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 2024 వరదలు, 2025 మార్చి అకాల వర్షాలతో నష్టపోయిన 2.07 లక్షల మంది రైతులకు రూ.310.30 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామని వివరించారు. వరి, పత్తి, వేరుశనగ, చెరకు పంటలకు హెక్టారుకు సబ్సిడీని రూ.17 వేల నుంచి రూ.25 వేలకు, ఇతర పంటలకు రూ.15 వేలకు పెంచామని వివరించారు.
పంటల బీమా ఉన్నా లేకపోయినా 33 శాతం పంట నష్టం జరిగితే గరిష్ఠంగా 2 హెక్టార్ల వరకు ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఖరీఫ్-2026లో 4 విపత్తులకు కలిపి 14,59,225 మంది రైతులకు చెందిన 12,06,269.84 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని పేర్కొన్నారు. పెంచిన రాష్ట్ర సహాయ రేట్ల ప్రకారం ఈ నాలుగు విపత్తులకు రూ.2,532.89 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమని అంచనా వేసినట్లు చెప్పారు.
ఖరీఫ్-2026 కరువు (20 జిల్లాలు - రూ.1,863.23 కోట్లు), అర్నాబ్ తుపాను (13 జిల్లాలు - రూ.559.77 కోట్లు) నష్టం నమోదైందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. మురసు తుపాను (9 జిల్లాలు - రూ.78.65 కోట్లు), సెప్టెంబర్ వరదలకు (13 జిల్లాలు - రూ.31.24 కోట్లు) ఇన్పుట్ సబ్సిడీ అవసరమని అంచనా వేసినట్లు చెప్పారు. ఖరీఫ్-2026 కరువుకు సంబంధించి రూ.2,743.78 కోట్ల ప్రతిపాదనలు, మొంథా తుపాను సహా ఇతర విపత్తుల ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
రబీ 2026-27 బీమా కోసం వరి, మామిడి పంటలకు డిసెంబర్ 31లోగా, ఇతర నోటిఫైడ్ పంటలకు డిసెంబర్ 15లోగా నమోదు చేసుకోవాలని రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పంటల బీమా సందేహాల నివృత్తికి కిసాన్ కాల్ సెంటర్ 1800-180-1551 లేదా హెల్ప్‌లైన్ 155251ను సంప్రదించ వచ్చని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
రాయలసీమ లిఫ్ట్‌పై జగన్‌కు బీటెక్ రవి సవాల్..
రాత్రి.. లేటుగా నిద్రపోతున్నారా..? అయితే ఈ అవయవాలపై ఎఫెక్ట్ పడ్డట్లే..
Read Latest AP News And Telugu News