రాయలసీమ లిఫ్ట్‌పై జగన్‌కు బీటెక్ రవి సవాల్..
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:39 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మరోసారి మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు.
అమరావతి, నవంబర్ 26: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మరోసారి మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఆయన అంటూ జగన్‌ను అభివర్ణించారు. గురువారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు కృష్ణా జలాలు అందిస్తున్నారని పొరుగు రాష్ట్రాల నాయకులే కీర్తిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
2020లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించామని తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన విషయానికి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2020లోనే ఎన్‌జీటీ ఆ ప్రాజెక్టును నిలిపి వేసిందని వివరించారు. అయితే ఈ పథకాన్ని చంద్రబాబు నిలిపి వేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
జీఓ 365తో 102 రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు జగన్ రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బీటెక్ రవి ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.13,500 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. జగన్ పాలనలో రాయలసీమ లిఫ్ట్ పేరుతో రూ.1000 కోట్లు మట్టి పనులు చేసి దోచుకున్నారని వైసీపీ నేతలపై టీడీపీ నేత బిటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.