ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - May 14 , 2026 | 08:36 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
అమరావతి, మే13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారని తెలుస్తుంది.
పొదుపు చర్యలపై మంత్రులతోపాటు అధికారులకు ఈ సమావేశంలో సీఎం కీలక సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంపై చర్చ జరపనున్నారు. 17వ ఎస్ఐపీబీ ఆమోదించిన పలు అంశాలపై చర్చించి.. ఆమోదం తెలపనున్నారు. మొత్తం 25 ప్రాజెక్టులకు చెందిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులను కూడా ఈ కేబినెట్‌లో ఆమోదించనున్నారు. విశాఖపట్నంలో రూ. లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
అలాగే సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమతోపాటు పలు కీలక సంస్థలకు భూకేటాయింపులను ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. ఇప్పటికే తన కాన్వాయ్‌లో 50 శాతం వాహనాలు తగ్గించాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఆదేశాలను అధికారులకు వారు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
బస్సును డీ కొట్టిన లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
మద్యం మత్తులో వీరంగం.. యువకులకు స్థానికులు దేహశుద్ధి
For More AP News And Telugu News