సోషల్ మీడియా దుర్వినియోగంపై కేబినెట్ సీరియస్.. కఠిన చట్టాలకు సీఎం ఆదేశం: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:38 PM
సోషల్ మీడియా వల్ల సమాజానికి ఉపయోగంతో పాటు తీవ్ర నష్టం కలిగించే ‘రోగంగా’ మారుతోందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల ఆలోచనా విధానం, పాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని కేబినెట్‌లో చర్చ జరిగిందని చెప్పారు.
అమరావతి, జులై 10: సోషల్ మీడియా వల్ల సమాజానికి ఉపయోగంతో పాటు తీవ్ర నష్టం కలిగించే ‘రోగంగా’ మారుతోందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల ఆలోచనా విధానం, పాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని కేబినెట్‌లో చర్చ జరిగిందని చెప్పారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం వివరాలను మంత్రి పార్థసారథి విలేకర్ల సమావేశంలో వివరించారు. ప్రపంచంలోని అనేక దేశాలు సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయన్న అంశంపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. సంప్రదాయ మీడియాకు ఉన్న జవాబుదారీతనం, నైతిక విలువలు సోషల్ మీడియాలో కనిపించడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం, అసత్య సమాచారం పెరుగుతోందని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, అసత్య ప్రచారం కోసం కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటువంటి కార్యకలాపాలకు కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నాయని విమర్శించారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ, పోలీసు అధికారులు క్యాబినెట్‌కు సమగ్ర నివేదిక సమర్పించారని పేర్కొన్నారు. విదేశాల్లో అమలులో ఉన్న సోషల్ మీడియా చట్టాలు, భారత ఐటీ చట్టంలోని లోపాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు వివరించారు.
మహిళలను, బాలికలను కించపరిచే పోస్టులు, వ్యక్తిత్వ హననం, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం సహించదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై చట్టాలను మరింత బలోపేతం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారని చెప్పారు. రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సోషల్ మీడియా దుర్వినియోగం, ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
విద్వేష ప్రచారం, వ్యక్తిత్వ హననం చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను గుర్తించేందుకు ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చాలని ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై అన్ని ఎస్‌హెచ్‌ఓలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. సైబర్ ఇన్వెస్టిగేషన్‌లో నైపుణ్యం కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అవసరమైతే నియమించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారని చెప్పారు. సోషల్ మీడియా దుర్వినియోగ నియంత్రణపై దేశ, విదేశాల్లో అమలులో ఉన్న ఉత్తమ విధానాలపై గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ (జీఓఏం) అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు.
అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధించడంపై క్యాబినెట్‌లో విస్తృత చర్చించామని పేర్కొ్న్నారు. సంక్షేమ కార్యక్రమాల నిరంతర అమలుకు రాష్ట్ర ఆర్థిక పటిష్టత అత్యంత కీలకం అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించే విధానాలపై ప్రతి క్యాబినెట్‌లో చర్చ జరుగుతోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గేట్ కీపర్ సాహసానికి నెటిజన్ల సెల్యూట్.. షాకింగ్ ఘటన!
ఏనుగు పాదమే మెట్టైంది.. చిన్నారి సాహసం వీడియో వైరల్
For More AP News And Telugu News