మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం
ABN , Publish Date - May 20 , 2026 | 09:56 AM
మత్స్యకారుల వలసలు తగ్గించి, తీరప్రాంతాల్లోని వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అమరావతి, మే 20: మత్స్యకారుల వలసలు తగ్గించి, తీరప్రాంతాల్లోని వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది 'మత్స్యకార సేవలో' పథకం నిధులు విడుదల చేశామని తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన అభివర్ణించారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. మత్స్యకారుల సేవలో పథకం కింద.. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని వివరించారు.
గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇచ్చిందని.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసిందని ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుందన్నారు. ఈ పథకం కోసం మొత్తం రూ.262 కోట్లను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్ధిదారులకు రూ.49.86 కోట్లు, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని వివరించారు. మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీర పరిధిలో 23 ల్యాండింగ్ సెంటర్లతోపాటు 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు వారికి ఎంతగానో ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. 4,578 మత్య్సకార బోట్ల కోసం 91.48 లక్షల లీటర్ల డీజిల్‌పై ప్రభుత్వం రూ.8.23 కోట్ల సబ్సిడీని అందించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డీఆర్డీఏ సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.1.13 కోట్ల సబ్సిడీ కింద అందించామన్నారు.
కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా 100 శాతం సబ్సిడీపై ట్రాన్స్‌పాండర్స్ అందిస్తుందని తెలిపారు. ఇవి తుపానులు, అత్యవసర పరిస్థితుల్లో వారికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
సముద్రంలో జీవ వైవిధ్యాన్ని, చేపల సంఖ్యను పెంచడానికి జిల్లాలో 20 ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు. ఒక్కో చోట రూ. 20 లక్షల వ్యయంతో ఆర్టిఫిషియల్ రిఫ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను ప్రభుత్వం పంపిణి చేస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా.. ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఫిర్యాదు.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన వికాస్ కిడ్నాప్ గ్యాంగ్స్..
For More AP News And Telugu News