వైసీపీ నిర్వాకంతో 25శాతం ఖర్చుల భారం
ABN , Publish Date - Aug 18 , 2026 | 09:43 AM
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు శ్రావణ్‌కుమార్, బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
రాజధాని అమరావతిలో పనుల జోరు
119 ప్రాజెక్టుల్లో 97 పనులు ప్రారంభం
అసెంబ్లీలో మంత్రి నారాయణ వివరణ
36 ప్రాజెక్టులతో ఇరిగేషన్ కేలండర్: నిమ్మల
బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి: మంత్రి సవిత
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు శ్రావణ్‌కుమార్, బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. వీటికి మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ‘‘అమరావతి కేపిటల్ సిటీలో ఇప్పటి వరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రతిపాదించాం. వాటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేశాం. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.41,187 కోట్ల రుణం సమకూర్చుకున్నాం. 2024 సంవత్సరం నుంచి రూ.12,731 కోట్లు ఖర్చు చేశాం.
గత ప్రభుత్వం(వైసీపీ) అమరావతిని నిలిపివేయడం వల్ల నిర్మా ణ వ్యయం 25 శాతం పెరిగింది. రూ.904 కోట్లతో 29 గ్రామాల్లో రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించనున్నాం. ఈ పనులకు సంబంధించిన టెండర్లను ఈ నెల 27న ఖరారు చేయనున్నాం’ అని వివరించారు. బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోషియేషన్‌కు అమరావతిలో భూ కేటాయింపు అంశంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. భూకేటాయింపు నిబంధనల ప్రకారం ప్రైవేట్ అసోషియేషన్లకు అమరావతిలో భూములు కేటాయించే అవకాశం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా కాంట్రాక్టర్లకు 3 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
2029కి డెల్టా ఆధునీకరణ
2029 నాటికల్లా డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. యనమదుర్రు డ్రైన్ ఆధునీకరణ, కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ‘‘గోదావరి డెల్టాలోని కాలువల ఆధునీకరణకు రూ.14 కోట్ల వ్యయంతో లైడార్ సర్వే పూర్తి చేశాం. డీపీఆర్ కూడా తయారు చేస్తున్నాం. రాష్ట్రంలో 36 ప్రాధాన్యత ప్రాజెక్టులతో సీఎం చంద్రబాబు ఇరిగేషన్ కేలండర్ విడుదల చేశారు. వీటిలో గోదావరి డెల్టా ఆఽధునీకరణ కూడా ఉంది’ అని తెలిపారు. రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. హాస్టళ్లలో మౌలిక వసతులపై ఎమ్మెల్యే సింధూరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. సీఎ్‌సఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ ద్వారా హాస్టళ్లను బాగుచేస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ స్వయంగా ప్లాన్ గీశారు: స్పీకర్
భీమిలి బీసీ గురుకుల పాఠశాల నిర్మాణం చేపట్టేటప్పుడు ఎన్టీఆర్ స్వయంగా పేపర్, పెన్ను తీసుకుని డిజైన్ గీసి ఇచ్చారని, ఆ గురుకులానికి అంతటి ప్రాధాన్యముందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. మంత్రి సవిత ఆ భవనం నిర్మాణం విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.