Share News

Sujana Chowdary: రాజధాని రైతులతో భేటీ.. ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 15 , 2026 | 07:21 PM

రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Sujana Chowdary: రాజధాని రైతులతో భేటీ.. ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

అమరావతి, జనవరి 15: కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని వారికి స్పష్టం చేశామని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒక సంఘంగా ఏర్పడి.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులకు సూచించినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మానిటరింగ్ చేసుకోవాలని వారికి తెలిపానని పేర్కొన్నారు. గురువారం రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో రైతులు సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా సుజనా చౌదరి దృష్టికి రైతులు.. తమ సమస్యలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారితో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కాకుండా రైతులు తరఫున నలుగురు ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని వారికి వివరించానన్నారు. సమస్యలపై అర్జీల స్టేటస్, ట్రాకింగ్ కోసం అవసరమైతే తన తరఫున సాప్ట్‌వేర్ మెకానిజాన్ని అందజేస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చానని పేర్కొన్నారు.


ఇక స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అందరూ సమర్థవంతమైన నాయకులేనని గుర్తు చేశారు. వారితో సమన్వయంతో ముందుకు సాగాలంటూ ఈ సందర్భంగా రైతులకు స్పష్టం చేశారు. అమరావతి రాజధాని చట్టం అవుతుందని.. దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు ప్రాసెస్‌లో ఉన్నాయని చెప్పారు. దీనిని కేంద్రం కచ్చితంగా చట్టం చేస్తుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు.


ఈ సమావేశంలో.. తమ సమస్యలను ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి రైతులు తీసుకెళ్లారు. కొందరు అధికారుల తీరు వల్ల తమ సమస్యలు జటిలమవుతున్నాయని ఆయన ఎదుట రైతులు తమ ఆవేదన వెళ్లగక్కారు. కొందరు రైతుల సమస్యలు పరిష్కరించక పోవడం వల్లే.. అందరికీ సమస్యలు ఉన్నట్లుగా ప్రజల్లోకి వెళ్తుందంటూ సుజనా చౌదరి దృష్టికి రాజధాని ప్రాంతంలోని మహిళలు తీసుకు వెళ్లారు.


అధికారుల తీరు వల్ల గతంలో 14 అంశాలకు సంబంధించి సమస్యలుంటే.. అవి నేడు 20 అంశాలను దాటాయని సుజనా చౌదరికి సోదాహరణగా రైతులు వివరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పైవిధంగా రైతులకు కీలక సూచనలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..

గాలిపటంలా జీవితంలో పైకి ఎదగాలి: హరీష్ రావు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 15 , 2026 | 09:27 PM