Share News

Chhattisgarh: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:42 PM

కేంద్రం.. ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాాజాగా వారికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Chhattisgarh: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..

రాయ్‌పూర్, జనవరి 15: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. 52 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. గురువారం ఉదయం బీజాపూర్ జిల్లా ఉన్నతాధికారులతోపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎదుట వీరంతా లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.

లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోన్‌, ఏవోబీలో విధులు నిర్వహిస్తున్న మావోయిస్టులతోపాటు బహ్మరాఘడ్ ఏరియా కమిటీలోని సభ్యులు సైతం ఉన్నారు. వీరిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉందని పోలీస్ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని స్పష్టమైన భరోసా కల్పించడంతో వీరంతా లొంగిపోయారని బీజాపూర్ జిల్లా ఎస్పీ జీతేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు.

Maoists.jpg


లొంగిపోయిన వారిలో.. డివిజన్ కమిటీ సభ్యుడు లక్కు కరం అలియాస్ అనిత్ (32), ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు లక్ష్మీ మాద్వి (28), చిన్ని సోది అలియాస్ శాంతి (28).. వీరు ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ప్రకటించామని చెప్పారు. మరో 13 మందికి.. ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, 19 మందికి రూ. 2 లక్షలు, మరో 14 మందికి రూ. లక్ష చొప్పున రివార్డుగా ప్రకటించామన్నారు. లొంగిపోయిన 52 మంది మావోయిస్టుల్లో 49 మందికి మొత్తం రూ. 1.41 కోట్లు ప్రకటించామని వివరించారు. అయితే ఈ లొంగిపోయిన మావోయిస్టులు అందరికి తొలుత రూ. 50 వేలు చొప్పున అందజేస్తామని జిల్లా ఎస్పీ యాదవ్ వెల్లడించారు.


ఇక నిన్న అంటే బుధవారం సుక్మా జిల్లాలో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనవరి 8న దంతేవాడ జిల్లాలో 63 మంది, జనవరి 7న 26 మంది ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. గతేడాది అంటే.. 2025లో మొత్తం 1,500 మంది మావోయిస్టులు.. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే లొంగిపోయారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దాంతో మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో లొంగుబాటు ప్రక్రియ ఒక క్రతువుగా కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

గాలిపటంలా జీవితంలో పైకి ఎదగాలి: హరీష్ రావు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 15 , 2026 | 07:37 PM