28th Commonwealth Conference: 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:30 PM
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన న్యూఢిల్లీలో 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పార్లమెంటరీ డెమాక్రసీలో స్పీకర్ పాత్ర ప్రత్యేకమైనదని ప్రధాని అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని.. ప్రజాస్వామ్యం బలంగా మార్చిందని తెలిపారు.
న్యూఢిల్లీ, జనవరి 15: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని సంవిధాన్ సదన్ (పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్) సెంట్రల్ హాల్‌లో 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని (CSPOC)ప్రారంభించారు. ఈ మూడు రోజుల సమావేశంలో 42 కామన్‌వెల్త్ దేశాల నుంచి 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు, నలుగురు అర్ధ-స్వయంప్రతిపత్తి పార్లమెంట్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈ సమావేశాల్లో వివిధ దేశాల నుంచి అత్యధిక మంది ప్రతినిధులు పాల్గొనడం విశేషం.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. పార్లమెంటరీ డెమాక్రసీలో స్పీకర్ పాత్ర ప్రత్యేకమైనదని, వారు తక్కువ మాట్లాడినా అందరికీ సమాన అవకాశం కల్పించాలని తెలిపారు. భారతదేశ వైవిధ్యాన్ని.. ప్రజాస్వామ్యం బలంగా మార్చిందని, స్వాతంత్య్రానంతరం భారత్‌లో డెమోక్రసీ బతకదనే అనుమానాలను తిప్పికొట్టిందని గుర్తుచేశారు.
'భారతదేశంలో డెమాక్రసీ అంటే లాస్ట్ మైల్ డెలివరీ' అని పేర్కొంటూ ప్రధాని.. ప్రజాస్వామ్య వ్యవస్థలు స్థిరత్వం, వేగం, ఉన్నతస్థాయిని అందిస్తాయని వివరించారు. 2024 భారత ఎన్నికలు మానవ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తుగా ప్రధాని తెలిపారు. 98 కోట్ల ఓటర్లు, 8 వేల మంది అభ్యర్థులు, 700 పార్టీలతో ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో గ్రాస్ రూట్ స్థాయిలో మహిళా ప్రతినిధులు అత్యధిక స్థాయిలో పాల్గొన్నారని ప్రధాని వెల్లడించారు.
భారతదేశం ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం.. UPI ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సిస్టమ్, అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు, పాలు, ఆహారపదార్థాల ఉత్పత్తిలో అగ్రస్థానాల్లో ఉందని తెలిపారు.
సమావేశ థీమ్ 'Effective Delivery of Parliamentary Democracy'ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ.. AI సాయంతో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్, ఓపెన్-సోర్స్ టెక్నాలజీలను గ్లోబల్ సౌత్ దేశాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశం కామన్‌వెల్త్ దేశాల మధ్య సహకారాన్ని పెంచి, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
Read Latest Telangana News and National News